గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు.. నిరుద్యోగులకు ఫీజు భారం?
ప్రభుత్వం తాజా నిర్ణయంతో గ్రూప్-1 ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో:టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 నోటిఫికేషన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్ కు సంబంధించిన వివిధ సమస్యల గురించి కమిషన్ వివరంగా చర్చించింది. మొత్తం పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న కమిషన్.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన సమాచారాన్ని తదనుగుణంగా అభ్యర్థులందరికీ తెలియజేస్తామని ప్రకటనలో పేర్కొంది. కాగా 503 పోస్టుల భర్తీ కోసం 2022 ఏప్రిల్ లో గత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇటీవల రేవంత్ రెడ్డి సర్కార్ 60 గ్రూప్-1 పోస్టులకు కొత్త ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు చేస్తూ కొత్త పోస్టులతో కలిపి త్వరలో గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
కేసు క్లియర్ కాదనే కొత్త నోటిఫికేషన్?:
2022 లో గ్రూప్-1 కోసం నోటిఫికేషన్ విడుదల కాగా దీనికి 3.5 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 2022 అక్టోబర్ లొ పరీక్ష నిర్వహణ చేశారు. 2.80 లక్షల మంది పరీక్షకు అటెండ్ అయ్యారు. ఆ తర్వాత ప్రిలిమ్స్ ఫలితాలు సైతం వెలువడ్డాయి. కానీ పేపర్ లీకేజీ కారణంతో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసి 2023 జూన్ లో రెండోసారి పరీక్ష నిర్వహించింది. ఈసారి పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని పరీక్ష రద్దు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ చేసినప్పటికీ ఇంతవరకు వాదనలు జరగలేదు. ఇక ఈ కేసు క్లియర్ అయ్యే అవకాశం లేదని మరి కొన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
అభ్యర్థులకు ఆర్థిక భారం?:
ప్రభుత్వం తాజా నిర్ణయంతో గ్రూప్-1 ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న తెలంగాణ నిరుద్యోగుల్లో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తే మళ్లీ ప్రెష్ గా దరఖాస్తులు చేసుకోవాలా? దరఖాస్తు చేసుకుంటే మళ్లీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందా? అనే అనుమానాలు అభ్యర్థులను వేధిస్తోంది. గతంలో రూ.200 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పరీక్ష ఫీజు కింద రూ.120 ఛార్జ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికోద్యొగులతో పాటు డిక్లరేషన్ సమర్పించే నిరుద్యోగులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లకు మొట్టమొదటి గ్రూప్-1 నోటిఫికేషన్ 2022లో విడుదలైతే ఆ పరీక్షలు రెండు సార్లు రద్దు కావడం అభ్యర్థులను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. చాలా మంది గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు హైదరాబాద్ కు, జిల్లా కేంద్రానికి వచ్చి గదులు అద్దెకు తీసుకుని కోచింగ్ కు వెళ్లి ప్రిపేర్ అయ్యారు. ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా ఎదురొడ్డి సిద్ధం అయితే రెండు సార్లు పరీక్ష రద్దు కాగా ఈసారి ఏకంగా నోటిఫికేషనే క్యాన్సిల్ కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు