'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఇదే'
లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ అరెస్టు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహస్య ఒప్పందం జరిగిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎల్ సంతోష్ అరెస్టు కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రహస్య ఒప్పందం జరిగిందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వారిని కాపాడుకోవాలని బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ద్వజమెత్తారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వాలతో సీబీఐ, సిట్ మధ్య కూడా రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనడానికి తీసుకునే శ్రద్ధ, బీసీలకు న్యాయం చేయడంలో చూపడం లేదని విమర్శించారు. బీసీల కులగణన చేయడం లేదన్నారు. అందుకు రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బీసీల న్యాయం కోసం మహా ఉద్యమం చేపట్టిందని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు వారి సంపద కోసం పోరాటం చేస్తుంటే, బీఎస్పీ పేదలకు న్యాయం కోసం పోరాడుతుందని స్పష్టం చేశారు.
పోడు పట్టాలు ఇంకెప్పుడు?
రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 15లోగా పోడు పట్టాలిస్తామని చెప్పి నెల రోజులవుతున్నా గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. పోడు భూముల సర్వే పేరుతో భూముల లెక్కింపులు జరుగుతున్నాయి తప్ప పట్టాలు ఇవ్వడంలేదని విమర్శించారు. సర్వేల పేరుతో అమాయక ఆదివాసులు, అటవీ అధికారులకు మధ్య గొడవలు పెట్టిస్తుందని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ప్రజలందరిని విద్య, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసినట్టే ఆదివాసీలను మోసం చేస్తున్నారన్నారు. అనంతరం పాల్వంచ పట్టణంలో బీఎస్పీ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎర్ర కామేష్, జిల్లా అధ్యక్షుడు మడకం ప్రసాద్ దొర, జిల్లా మహిళా కన్వీనర్ ధనలక్ష్మి, జోనల్ మహిళా కన్వీనర్ రజిత, జున్ను రవి, దామోదర్, కృష్ణ, మల్లికార్జున రావు, నియోజకవర్గ అధ్యక్షుడు జయంత్, మహ్మద్ అబ్దుల్, రోహిణి తదితరులు పాల్గొన్నారు.