కేసీఆర్ మనసులో ఉన్న అసలు మాట చెప్పగలరా?: RSP
ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరపడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? మనసులో ఉన్న అసలు మాట చెప్పండి అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఏప్రిల్ 14వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరపడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనా? మనసులో ఉన్న అసలు మాట చెప్పండి అని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రికి 25 ప్రశ్నలతో మంగళవారం బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా పార్టీ ఆఫీస్‌లో మీడియాతో ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. గతంలో చాలా సందర్భాల్లో ట్యాంక్ బండ్ మీద ఉన్న 8 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే సమయం దొరకని మీకు కనీసం 2023 లోనైనా సమయం దొరకడం ఒక వింతగా ఉన్నా, సంతోషించదగ్గదన్నారు. మరి తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎస్టీ, ఎస్సీ, సబ్ ప్లాన్ నిధులు ఎన్ని విడుదల చేశారని, ఎన్ని ఖర్చులు చేశారని ప్రశ్నించారు.
ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి లాంటి అధికారులకు కుర్చీలు కూడా సరిగా లేని గోదాముల్లో ఉన్న చీకటి ఆఫీస్సులో జరిగిన అవమానాలు, ప్రదీప్ చంద్ర అనే ఎస్సీ వర్గానికి చెందని అధికారికి ఛీఫ్ పెక్రటరీగా ఎక్స్‌టెన్షన్ చేయడానికి కలిగిన ఇబ్బందులేమిటో వివరించగలరా? అని అన్నారు. పదవిలో ఉండగా మరణించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి పంచి ఇస్తామని చెప్పి అసైన్డ్ భూములు ఎందుకు లాక్కున్నారు? ఎవరి కోసం లాక్కున్నారని అన్నారు. నేటికీ రాష్ట్రంలో ఎస్టీ, ఎస్సీల కోసం పని చేయాల్సిన రాజ్యాంగ బద్దమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నది ఎందుకని 25 రకాల ప్రశ్నలను సీఎం కేసీఆర్‌కు వేశారు. దళిత ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించలేదని, ఎందుకంటే ఆ పదవి ఒకరు ఇస్తే తీసుకునేది కాదని ప్రజలు అభిమానంతో, నమ్మకంతో ఇచ్చిందన్నారు.