పోలీసుల విచారణకు ముందే ఫిక్స్ చేసేశారు
పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు జరిపి తేల్చకముందే బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆయనే సూత్రధారుడంటూ తేల్చడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
దిశ, తెలంగాణ బ్యూరో : పదో తరగతి హిందీ పేపర్ లీకేజీ విషయంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు జరిపి తేల్చకముందే బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆయనే సూత్రధారుడంటూ తేల్చడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు సమగ్రంగా దర్యాప్తు జరగకముందే, ఆయనపై నిర్దిష్ట అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే బీఆర్ఎస్ నేతలు ఆయనను దోషిగా చూపెట్టే కామెంట్లు ఎలా చేయగలిగారని బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆయనను ఈ కేసులో ఇరికించేందుకు, అరెస్టు చేసేందుకు పథకం రచించిందని, దాన్ని గులాబీ నేతలు ముందుగానే బాహాటంగా ప్రకటించేశారని, పోలీసుల విచారణకు ముందే ఆయనను ఫిక్స్ చేశారని పలువురు బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. హిందీ పేపర్ లీక్ వెనుక బీజేపీ కుట్ర ఉన్నదని, రాజకీయ ప్రయోజనం కోసం విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశ సందర్భంగా వ్యాఖ్యానించిన విషయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావించారు.
ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ పార్టీ పేపర్ లీకేజీకి పాల్పడుతున్నట్లు ఆమె వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సైతం ఇదే తరహాలో చేసిన ‘రాజకీయ లబ్ధి కోసమే పేపర్ లీకేజీల దుర్మార్గానికి బీజేపీ ఒడి గడుతున్నది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీని ప్రజలు చీదరించుకుంటున్నారు’ అనే కామెంట్లను గుర్తు చేశారు.
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి.. ‘పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ కుట్ర కోణం బయటపడిందని, కమలాపూర్ బీజేపీ కార్యకర్త ప్రశాంత్ బండి సంజయ్‌కు వాట్సాప్ ద్వారా పంపించారని, బాధ్యతాయుత స్థానంలో ఉన్నా ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయకుండా గోప్యంగా ఉంచారని, ఆయనపై లోక్‌సభ అనర్హత వేటు వేయాలని..’ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు గుర్తు చేశారు. తెలంగాణ రెడ్‌కో చైర్మన్ సతీష్‌రెడ్డి సైతం... ‘పేపర్ లీకేజీకి ప్రధాన సూత్రధారుడు బండి సంజయ్ అని, ఆయనను అరెస్టు చేయాలి’ అంటూ డిమాండ్ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. వీరంతా మంగళవారమే పై కామెంట్లు చేశారని, అప్పటికి బండి సంజయ్ ప్రమేయం గురించి వరంగల్ పోలీస్ కమిషనర్ నిర్ధారణకు రాలేదని పేర్కొన్నారు.
కరీంనగర్‌లో బండి సంజయ్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత బుధవారం మధ్యాహ్నం వరకు హైడ్రామా చోటు చేసుకుంది. కానీ ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు, మంత్రులు పదుల సంఖ్యలో బండి సంజయ్ సూత్రధారుడనే తీరులో కామెంట్ చేయడం బీజేపీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసు సందర్భంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పడకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశాన్ని పెట్టి వీడియో, ఆడియో ఫుటేజీ బయటపెట్టిన తీరులో ఇప్పుడు గులాబీ నేతలు, మంత్రులు పేపర్ లీకేజీ విషయంలో బండి సంజయ్ పేరును ప్రస్తావించడం రాష్ట్ర బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టి బండి సంజయ్ పాత్ర గురించి వ్యాఖ్యానించడానికి ముందే అధికార పార్టీ నేతలు రకరకాల వ్యాఖ్యానాలు చేయడాన్ని బీజేపీ లాయర్లు సైతం గమనంలోకి తీసుకున్నారు. పోలీసులు ఒక నిర్ధారణకు రావడానికి ముందే బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్‌ను ఫిక్స్ చేయడం ఒక పథకం ప్రకారం జరిగిందని, ముందస్తుగా ఆయనను దోషిగా చూపెట్టడంలో భాగంగా ప్రీ-ప్లాన్డ్ గా జరిగిన కుట్ర అంటూ బీజేపీ నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావులను పోలీసులు అరెస్టు చేస్తున్న సందర్భంగా అనుమానాలను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం పోలీసులు నిబంధనలకు అనుగుణంగా పని చేయడానికి బదులు కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరిస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ నేతల కామెంట్లను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నేతలు పై వ్యాఖ్యలు చేశారు.