Ponnam: త్యాగాలు చేసిన బాపూజీ చనిపొతే కేసీఆర్ గుండె కరగలేదు.. మంత్రి పొన్నం ఫైర్
బతుకమ్మ చీరల పంపిణీని ఆపేస్తోందని ప్రతిపక్షాల ప్రచారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీని ఆపేస్తోందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచనతో జీవో నంబర్ 1 తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాల్లో చేనేత వస్త్రాలు వాడుతున్నామని తెలిపారు. ఇవాళ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రులు తుమ్మల, జూపల్లి, సీతక్క, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేనేతను ఆదుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించిందని ఆరోపించారు. బాపూజీ మరణిస్తే ఆయన అంత్యక్రియలకు కేసీఆర్ హాజరు కాలేదని విమర్శించారు. బాపూజీ వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించేలా సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు.