రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేశారు.. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే

కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్ సేల్‌గా అమ్మేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ అన్నారు.

Update: 2024-04-21 14:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి హోల్ సేల్‌గా అమ్మేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యల పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిపించుకుని కాంగ్రెస్ కండువా కప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ కేడర్ తిరుగుబాటు చేస్తోందన్నారు. సెక్రటేరియట్, ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమంత్రి నివాసం పైరవీలకు అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను మర్చి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో అభ్యంతరకర భాషను వాడుతున్నారని, సీఎం అని మర్చిపోతున్నారన్నారు. సీఎం అయిన నాలుగు నెలలకే రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయిందన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారన్నారు.

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు అఫిడవిట్లు ఇచ్చారని, అమలు ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ స్థానాలు గెలవకపోతే సీఎం కుర్చీ పోతుందని రేవంత్ రెడ్డి భయపడుతున్నారన్నారు. ఆగస్టు నెలలో రైతు రుణమాఫీ చేస్తామని మహబూబాబాద్, మెదక్ సభల్లో రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేశారన్నారు. దేవుడిపై ప్రమాణం చేసి ఓట్లు అడగడం అంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కరెంటు తీగ అయితే ఫీజులు ఎగిరిపోతాయన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే జనజాతర అన్నారు. రేవంత్ రెడ్డి చేసేది ఓట్ల జాతర, కాంగ్రెస్ జాతర అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజలు సాగు, తాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

పవర్ మినిస్టర్ భట్టి విక్రమార్క సీపీఐ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ అర్ధగంట పాటు కరెంటు పోయిందని, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటున్నారన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు రేవంత్ రెడ్డి తాపత్రయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి నియంత్రించలేక పోతున్నారన్నారు. ముదిరాజ్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేస్తేనే ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ బస్సు యాత్రతో మంచి ఫలితాలు వస్తాయని, హైదరాబాద్ నగరంలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయని స్పష్టం చేశారు.

Read More...

రూ.2203 ధర ఇప్పిస్తా.. రైతులు అధైర్య పడకండి: హరీష్ రావు

Tags:    

Similar News