అధికార మదంతో సీఎం రేవంత్ మాటలు.. బీఆర్ఎస్ నేతలు

అధికార మదంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు.

Update: 2024-06-06 09:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: అధికార మదంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు అన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవిప్రసాద్ మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడలేక మద్దెల దరువు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు.బీఆర్‌ఎస్‌పై ప్రేలాపనలు పేలుతున్నారని సీరియస్ అయ్యారు. బీజేపీకి వాస్తవానికి ఓట్లు బదిలీ చేసింది సీఎం , మంత్రులు, ప్రభుత్వ విప్‌లే అన్నారు. బీజేపీ క్యాండిడేట్లను గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపిందన్నారు.

సిద్దిపేటలో హరీష్ రావు బీజేపీకి ఓట్లు బదిలీ చేశారని సీఎం రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీ కే ఆధిక్యత వచ్చిందని.. అంటే రేవంతే బీజేపీకి ఓట్లు బదిలీ చేశారా అని ప్రశ్నించారు. కొండంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో 30 వేలకు పైగా మెజారిటీ తెచ్చుకున్న రేవంత్ ఈ ఎన్నికల్లో 22 వేలకు పడిపోయారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ నేత దేవి ప్రసాద్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు 2014లో 11 సీట్లు, 2019లో 9 సీట్లు సాధించామన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నపుడు ఇంతకన్నా ఎక్కువ సీట్లు సాధించిందన్నారు.

8 సీట్లు సాధించి రేవంత్ రెడ్డి ఎగిరెగిరి మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనకు ప్రజలు మార్కులు వేయలేదని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ ఇపుడు ఎందుకు తక్కువ తెచ్చుకుందో రేవంత్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ ఫలితాలు తమ పాలనకు రెఫరండం అన్న రేవంత్ ఫెయిల్ అయ్యారన్నారు. ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలుస్తుంది ఇది మనం చూస్తున్న విషయమే కదా అన్నారు.


Similar News