పగ, ప్రతీకార రాజకీయాలకు పరాకాష్టగా రేవంత్ పరిపాలన: దాసోజు
విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్కు సంజాయిషీ నోటీసులా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్కు సంజాయిషీ నోటీసులా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగలేఖ రాశారు. పగ, ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు రేవంత్ పాలన పరాకాష్టగా మారిందని ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపినందుకు సంజాయిషీ నోటీసులా? ప్రతి ఇంటికి, ప్రతి పరిశ్రమకు నిరంతర విద్యుత్తు సరఫరా చేసి, అభివృద్ధికి దారితీసినందుకా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీకార రాజకీయాలను పక్కనపెట్టి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధిని అడ్డుకునే దుష్ప్రయత్నాలను విరమించుకోవాలని హితవు పలికారు. కేసీఆర్ నాయకత్వంలో వెలుగులు విరజిమ్మిన రాష్ట్రం, కరెంట్ లోటుతో సతమతమవుతున్న ప్రస్తుత పరిస్థితిని రాజకీయాలతో మరింత కష్టతరం చేయడం సరికాదన్నారు.
హామీల అమలు చేతగాక గుంపుమేస్త్రీగా డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తూ సంజాయిషీల, ప్రతీకార రాజకీయాలకు తెరలేపారని ఆరోపించారు. రుణ మాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు, నాలుగు వేల పెన్షన్, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళకు రూ.2500 లాంటి పథకాలు అమలు చేయాలని, వాటిపై దృష్టిసారించకుండా కేసీఆర్ను బద్నాం చేయాలని చూడటం అన్యాయమన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలను, వారి అభివృద్ధిని అణగదొక్కే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.