రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి.. బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాప్ ముఖ్యమంత్రి అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్‌లో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన అన్నదమ్ములకు పంచి ఇచ్చారన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ సి.రాకేష్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందన్నారు. విద్యాశాఖలో గందరగోళమైన పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ ఫొటోలు పాఠ్యపుస్తకాలపై ఉన్నాయని పుస్తకాలు ప్రభుత్వం వెనక్కి తెప్పించిందన్నారు. తమిళనాడులో స్కూల్ బ్యాగులపై జయలలిత ఫొటోలు ఉన్నా స్టాలిన్ వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరని మండిపడ్డారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన రైతుబంధు ప్రారంభించలేదన్నారు. కేసీఆర్ భయంతోనే పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతుబంధు డబ్బులు రిలీజ్ చేశారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో పట్టపగలు వ్యక్తిని కొట్టి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. హోం శాఖ సీఎం దగ్గరే ఉందని అయినా చర్యలు శూన్యమన్నారు. పట్టపగలు దోపిడీలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వడం లేదని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కక్షతో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు అన్ని ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక బీఆర్ఎస్ వాళ్ళను తీసుకుని ఎంపీ టిక్కెట్లు ఇచ్చారని మండిపడ్డారు. 14 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి స్వంత జిల్లా మహబూబ్‌నగర్ ఎంపీ స్థానంలో ఓడిపోయారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియ కూటముల మధ్య పోటీయే జరిగిందన్నారు. దీంతో ఏ కూటమిలో లేని పార్టీలు తీవ్రంగా నష్టపోయాయన్నారు.
ఢిల్లీలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారన్నారు. అదేవిధంగా తెలంగాణలోనూ పార్టీ మారిన ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటువేయాలని కోరారు. బీజేపీపైన మాట్లాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. బొగ్గు బావులను వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బొగ్గుబావులను వేలం వేస్తామని కిషన్ రెడ్డి చెప్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపిత ఉదేశ్యంతో విద్యుత్ కొనుగోళ్లపై కమీషన్ ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. బీహెచ్ఈఎల్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల పక్షాన ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతామన్నారు. ప్రజలు ఏ పాత్ర ఇస్తే అది పోషిస్తామని స్పష్టం చేశారు.