ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకోని బీఆర్ఎస్.. ఎక్కడ లోపం జరిగిందో క్లియర్‌గా చెప్పిన కార్యకర్తలు!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఇప్పటికీ ఆత్మవిమర్శ కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలకే పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పరిమితమైనట్లు కనిపిస్తున్నాయి.

Update: 2024-01-23 02:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఇప్పటికీ ఆత్మవిమర్శ కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలకే పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పరిమితమైనట్లు కనిపిస్తున్నాయి. కానీ కార్యకర్తలు లేనవెత్తిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు కరువయ్యాయి. జనవరి మూడో తేదీన ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభమైన ఈ సమావేశాలు, జనవరి 22 నల్లగొండ లోక్ సభ సెగ్మెంట్‌తో ముగిశాయి. లోక్‌సభ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 70 నుంచి వంద మందిని పిలిచిన బీఆర్ఎస్ అధిష్టానం.. ఐదు నుంచి ఆరుగురికి మాత్రమే మాట్లాడే అవకాశమిచ్చిందనే విమర్శలున్నాయి.

పార్టీ తీరుపై కార్యకర్తల ఆగ్రహం

పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ప్రతి కార్యకర్త పార్టీ వ్యవహార శైలిని తప్పుపట్టారు. పార్టీ విధానాల వల్లే ఓడిపోయామని కుండబద్దలు కొట్టారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడామని, ఉద్యమకాలం నుంచి పార్టీలో ఉన్న వారిని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారాచూట్ నేతలకే పెద్దపీట వేశారని, కనీసం కార్యకర్తల బాగోగులు చూడలేదని వాపోయారు. పార్టీ కమిటీలు వేయలేదని, పదేళ్లు అధికారంలో ఉన్నా పార్టీ కమిటీల్లో, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించలేదని చెప్పారు. అలాంటప్పుడు పార్టీని ఎవరు నమ్ముతారనే ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా మార్చకపోవడమే పార్టీకి నష్టం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలతోనే ఓడిపోయినట్లు స్పష్టం చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాలని, కోవర్టులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు.

సమస్యలకు పరిష్కారం చూపని నేతలు

కార్యకర్తలు పార్టీలో జరుగుతున్న తీరు, నియోజకవర్గాల్లో నేతలు అనుసరిస్తున్న విధానాన్ని సమావేశంలో ఎండగట్టారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేడర్‌కు ఎమ్మెల్యేలు సమయం ఇవ్వలేదని, గ్రామాల సమస్యలను చెప్పుకుందామని వెళ్లినా చిన్నచూపే చూశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరించారు. కానీ, కార్యకర్తలు చెప్పిన అంశాలను నోట్ చేసుకుంటున్నామని మాత్రమే చెప్పి ముగించారు. పార్టీని ప్రక్షాళన చేస్తామని, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని, అందరికి అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. కానీ గ్రామస్థాయి నుంచి ఎలాంటి చర్యలు చేపడతారు? కార్యకర్తలకు నేతలకు మధ్య గ్యాప్‌ను ఎలా పూరిస్తారు? గతంలో తప్పిదాలను ఎలా సరిచేస్తారు? అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

విమర్శలకే పరిమితం

సన్నాహక సమావేశాలు జరిగినన్ని రోజులు కేవలం కాంగ్రెస్, బీజేపీ టార్గెట్ గా నేతలు విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, పోరాటాల పార్టీ అని 39మంది ఎమ్మెల్యేలం అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అయితే సమావేశాలు ముగిసేవరకు ఎక్కువ సమయం జాతీయపార్టీలపై విమర్శలకే కేటాయించినట్లు పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా పార్లమెంట్‌లో విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని మాటిమాటికి చెప్పడంతో పెదవి విరుస్తున్నారు.

కొన్ని స్థానాలకు ఓట్ల వివరాలు లేకుండా..

పార్లమెంట్ సన్నాహక సమావేశాలకు వచ్చే కార్యకర్తలకు కిట్ ఇచ్చారు. ఆకిట్‌లో కాంగ్రెస్ 420 హామీలు, బీఆర్ఎస్ ప్రగతినివేదిక, పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ లకు వచ్చిన ఓట్ల శాతాన్ని పొందుపర్చారు. పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్ సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటును కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేదు. నల్లగొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ ఒక్కో స్థానంలో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశాల్లో ఓట్లకు సంబంధించిన షీట్లను ఇవ్వలేదు. కానీ కేవలం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో మాత్రం వివరించారు. షీట్లు ఇస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్ని లక్షల ఓట్లతో ఓడిపోయామా? అయితే గెలవేలం అని మనోధైర్యం కోల్పోతారనే భావనతోనే ఇవ్వలేదని సమాచారం.

రంగంలోకి కేసీఆర్

ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ కార్యకర్త సమస్యలపై మాట్లాడారో అతడితో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీ ఓటమి గల కారణం? అక్కడి నుంచి పోటీ చేసిన నేత వ్యవహారశైలీ? ప్రజల్లో పార్టీపై ఉన్న అభిప్రాయాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అయితే పార్టీని ఎలా పటిష్టం చేస్తారు? కేడర్ అభిప్రాయాలను తీసుకొని ప్రక్షాళన చేస్తారా? లేదా అనేది చూడాలి. అదే విధంగా ఫిబ్రవరిలో అసెంబ్లీ వారీగా నిర్వహించబోయే సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..