ఇదే మంచి సమయం.. కారు దిగి వెళ్లిపోదామా..!
వారంతా పది సంవత్సరాలపాటు అధికార బీఆర్ఎస్‌లో ఉన్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులుగా, మరికొంతమంది పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఉంటూ మండలాలు, గ్రామాలు, పట్టణాలు అన్న తేడాలు లేకుండా తమ ఆధిపత్యాన్ని చాటుకుం టూ వచ్చారు.
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: వారంతా పది సంవత్సరాలపాటు అధికార బీఆర్ఎస్‌లో ఉన్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులుగా, మరికొంతమంది పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా ఉంటూ మండలాలు, గ్రామాలు, పట్టణాలు అన్న తేడాలు లేకుండా తమ ఆధిపత్యాన్ని చాటుకుం టూ వచ్చారు. మళ్లీ అధికారం తమ పార్టీకే వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశించారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ సమీకరణాలన్ని ఒక్కసారిగా మార్పులు చెందుతున్నాయి. పార్టీలో పదవులు అనుభవించిన వారు.. అనుభవించని వారు అనే తేడాలు లేకుండా గులాబీ పార్టీని వీడితేనే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని నిర్ణయాలకు వచ్చి కారు దిగుతున్నారు.
ఇటీవల పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు జోగులాంబ గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, నారాయణపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వనజ ఆంజనేయులు గౌడ్, నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, ఎమ్మెల్సీలుగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్ రెడ్డి, పెద్దమందడి ఎంపీపీగా ఉన్న మెగా రెడ్డి తదితర ప్రముఖ నేతలు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరారు. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ లో పోటీ చేసిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి నుంచి పోటీ చేసిన పెద్దమందడి ఎంపీపీ మెగా రెడ్డి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించగా.. గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య పలు కారణాలతో ఓటమిపాలయ్యారు.
ఎన్నికలకు ముందే అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ అబ్రహం, మాజీ ఎంపీ మంద జగన్నాథం సైతం పార్టీ మారిపోయారు. ఇటీవల నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఆయన తనయుడు భరత్ బీఆర్ఎస్ ను వీడీ బీజేపీలో చేరిన విషయం పాఠకులకు వివిధమే.. రాష్ట్ర నాటకారంగా అకాడమీ చైర్మన్గా ఉన్న వాటిని శివకుమార్, ఎవరి ఊహలకు అందని విధంగా మహబూబ్ నగర్ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పార్టీ మారడం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ మారారు.
అదే దారిలో మరికొందరు..
అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలు అయిన తర్వాత వెంటనే నిర్ణయం తీసుకోలేకపోయినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరిస్థితులను బట్టి పార్టీ మారితేనే తమకు మేలు జరుగుతుందన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కేసులకు భయపడి పార్టీ మారాలన్న నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది తమ రాజకీయ భవిష్యత్తుకోసం పార్టీ మారే అంశంపై తమ అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మారి పనిచేస్తే గుర్తింపు వస్తుందన్న ఆలోచనలతో ఉన్నట్లు సమాచారం.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మున్సిపల్ కౌన్సిలర్లు మొదలుకొని, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఆలోచనలను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు వారాలలో బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున దెబ్బ పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పార్టీ క్యాడర్ను కాపాడుకోవడానికి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది ప్రయత్నాలు చేస్తుండగా.. మరి కొంతమంది చేతులు ఎత్తివేశారు.. దీనితో పార్టీ క్యాడర్ కొన్ని నియోజకవర్గాలలో చిన్నాభిన్నం అయ్యా అవకాశాలు ఉన్నాయి.