బీఆర్ఎస్ బీసీ రాగం! జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్యతకు ప్లాన్

బీఆర్ఎస్ పార్టీ బీసీ రాగం అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నది.

Update: 2024-07-11 02:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ బీసీ రాగం అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నది. త్వరలో వేసే రాష్ట్ర, జిల్లా కమిటీల్లో వారికి పెద్దపీటవేయాలని భావిస్తున్నది. 25 జిల్లాల అధ్యక్ష బాధ్యతలను బీసీలకే ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో పార్టీ విజయం సాధించగా.. ఆయా సెగ్మెంట్లలో బీసీలే పార్టీని గట్టెక్కించారనే భావనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

పదేళ్లు అధికారంలో ఉన్నా..

రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు పవర్ లో ఉన్నది. అయితే అప్పుడు బీసీలను పట్టించుకోలేదనే ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేకంగా స్కీమ్స్ అమలు చేయలేదని, ఉపకారవేతనాలు పెండింగ్ లో పెట్టారని, రూ. లక్ష సాయం కూడా అర్హులందరికీ ఇవ్వలేదని పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో కొంత అసమ్మతి సైతం వ్యక్తమైనప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో వారి ఓటుతోనే కాస్త గట్టెక్కామని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. అన్ని వర్గాలు దూరమైనప్పటికీ బీసీలు బీఆర్ఎస్ కు అండగా నిలిచారని పలు సమావేశాల్లోనూ పార్టీ నేతలు పేర్కొన్నారు. దీంతో పార్టీ వారిని మరింత అక్కున చేర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందుకోసం కార్యాచరణను సైతం రూపొందిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో పార్టీ కమిటీలను త్వరలోనే వేయనున్నట్లు సమాచారం. అందులో భాగంగానే సుమారు 25 మందికి జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు బీసీ, యువజన సంఘాలను సైతం దగ్గర చేసుకునేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించారనే..

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఆయా సెగ్మెంట్లలో బీసీలు అండగా ఉండటంతోనే గట్టెక్కామని పార్టీ సర్వేల్లోనూ వెల్లడైనట్లు సమాచారం. ఏయే వర్గాలు పార్టీకి దూరమయ్యాయనే విషయాన్ని సైతం గ్రహించినట్లు తెలిసింది. వాటన్నింటికీ కమిటీల్లో తక్కువ ప్రయారిటీ ఇవ్వాలని, బీసీలకు పెద్దపీట వేస్తేనే రాబోయే అన్ని ఎన్నికల్లో గట్టెక్కుతామని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే కేవలం జిల్లా కమిటీల్లోనే కాకుండా.. గ్రామస్థాయి నుంచి వేసే అన్ని కమిటీలు, అనుబంధ కమిటీల్లోనూ ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. గత తప్పులు పునరావృతం కాకుండా ఆచీతూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

రాష్ట్ర కమిటీల్లోనూ పెద్దపీట!

బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీని వేసి దాదాపు పదేళ్లు అవుతున్నదని, అప్పుడు 67 మంది సభ్యులతో జంబో కమిటీ వేశారని పా ర్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహ క అధ్యక్షుడితో సహా సెక్రెటరీ జనరల్, 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సం యుక్త కార్యదర్శులను నియమించారు. అయితే వీరిలో చా లా మంది పార్టీ మారడం, వివిధ కారణాలతో పార్టీకి దూ రంగా ఉండడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుత కమిటీలోని సగం మంది నేతల పనితీరుపై కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. వీరంతా సంస్థాగత ఎన్నికల నిర్వహణ మొదలు కొని.. పార్టీ అప్పగించిన బాధ్యతలు కూడా సరిగా నిర్వర్తించడంలేదని వారి దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

ఇంకా చాలా మంది రాష్ట్ర కమిటీలోని పదవులను సొంత అవసరాల కు వాడుకున్నారని, వారివారి సామాజిక వర్గాల్లోనూ వారి కి పట్టు లేదని అగ్రనేతలు గుర్తించారు. మరికొంత కొంత మంది పార్టీ సభ్యత్వ నమోదు సమయంలోనూ నిర్లక్ష్యం చే శారని పార్టీ గుర్తించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ లో సమూల మార్పు చేయాలని, పాతవారికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధినేత భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో బీసీలకు పెద్దపీట వేయాల ని, సగం పోస్టులను వారికి అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే బీసీ వర్గాల కు చెందిన యువ నాయకులు ఉండటంతో వారు రాష్ట్ర కమిటీల్లో చోటుకోసం ఎదురుచూస్తున్నారు.

టీడీపీకి చెక్ పెట్టేలా..

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణపై దృష్టిసారించారు. పార్టీ బలోపేతానికి చర్యలకు శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీడీపీ బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుండటంతో వారు ఇప్పటికీ పార్టీకి వెన్నంటి ఉంటున్నారు. అయితే దానిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ సైతం బీసీ నినాదం ఎత్తుకోబోతున్నట్లు సమాచారం. బీసీ వర్గాలను చేరదీస్తే భవిష్యత్తులో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు రావని, మరోవైపు టీడీపీ విస్తరణను సైతం అడ్డుకోవచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుంది, బీసీలను ఎలా చేరదీసి వారి మన్ననలు పొందగలుగుతుంది, గత తప్పులను ఎలా సరిచేస్తుందనేది వేచి చూడాలి.


Similar News