ఆ అంశాలతో జర్నలిస్టులకు పాలసీ తీసుకురండి.. అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని
ప్రభుత్వం నిజమైన జర్నలిస్టులను గుర్తించి, వారి సంక్షేమం కోసం ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం నిజమైన జర్నలిస్టులను గుర్తించి, వారి సంక్షేమం కోసం ఒక పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (CPI MLA Kunamneni Sambashivarao) అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణలో జర్నలిస్టుల (Telangana Journalits) గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రభుత్వం జర్నలిస్టుల గురించి ఒక కమిటీ (Committee) వేస్తే బాగుంటుందని సూచించారు. నిజమైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు.. వాళ్ల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అందులో పెద్ద పత్రికలలో పని చేసేవారు ఎంతమంది, నగరాలలో పని చేసేవారు ఎంతమంది, గ్రామాలలో పని చేసేవారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని తెలిపారు. ఇందులో జర్నలిస్టుల పేరుతో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవారిని, బెదిరింపులకు గురి చేసేవారిని, బ్లాక్ మెయిల్ చేసే వారిని స్క్రీనింగ్ (Screening) చేయాలని సూచించారు. అలాగే మంచి జర్నలిస్టులు అనేవారని గుర్తించి, వారికి ఆరోగ్యం, చదువులు, పెన్షన్, ఇళ్లు లాంటివి ఇచ్చేలా.. వారి సంక్షేమం కోసం ఒక మంచి పాలసీ తీసుకొని రావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు కొన్ని హమీలు ఇచ్చారని, అవి అమలు కావట్లేదని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలను అడిగే పరిస్థితి నెలకొన్నదని వారి సమస్యల గురించి పట్టించుకోవాలని కూనంనేని ప్రభుత్వాన్ని కోరారు.