BREAKING: రేవంత్ మాట తప్పినందుకు పాప పరిహారం చేశా: హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు

రైతు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకు యాద్రాద్రి లక్ష్మినరసింహ స్వామి సమక్షంలో పాప పరిహారం చేశానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Update: 2024-08-22 07:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీపై రేవంత్‌రెడ్డి మాట తప్పినందుకు యాద్రాద్రి లక్ష్మినరసింహ స్వామి సమక్షంలో పాప పరిహారం చేశానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇవాళ టెంపుల్ టూర్‌లో భాగంగా ఆయన యాదాద్రిలో మాట్లాడుతూ.. రేవంత్ తప్పుడు ఒట్లకు ప్రజలను శిక్షించొద్దని ఆ లక్ష్మినరసింహ స్వామిని వేడుకున్నానని తెలిపారు. రుణమాఫీ కాని రైతులు రొడ్డెక్కితే అక్రమ కేసులు, బెదిరింపులతో వారి ఆగ్రహాన్ని అడ్డుకోలేరని అన్నారు. ఎన్నికల ముందు రైతుల రుణం తీరుస్తామని వారితో రణం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

రుణమాఫీ చేయమని ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజా పాలన అంటే అణచివేయడమేనా అని ప్రశ్నించారు. నిరసన చెప్పే హక్కు అన్నదాతలకు లేదా ఆక్రోశం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీతో సహా అన్ని హామీలు అమలు చేసే వరకు ప్రజల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. ఓ వైపు ప్రజాపాలన అంటూనే.. రైతులకు నోటీసులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు పేరుతో ప్రజలను అడ్డంగా మోసం చేశారని ఆక్షేపించారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి నిండా ముంచారని ఫైర్ అయ్యారు.

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని చెప్పారని.. రుణమాఫీ ఎక్కడైందో చూపాలన్నారు. రుణమాఫీపై ప్రశ్నిస్తే రేవంత్ తనను వాగులో దూకమని మాట్లాడారని.. ఆయనలా తాను దిగజారుడు వ్యాఖ్యలు చేయనని అన్నారు. ఆయన సంగతి ప్రజలే చూసుకుంటారని కామెంట్ చేశారు. దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది రాష్ట్రానికి అరిష్టం అని అన్నారు. అందుకే తాను రేవంత్ చేసిన పాపానికి ప్రజలను శిక్షించొద్దని యాదాద్రికి వచ్చి వేడుకుంటున్నా అని తెలిపారు. మాట తప్పిన రేవంత్ ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కాబట్టే తాము దేవుడికి ప్రార్థనలు చేస్తున్నామని హరీశ్‌రావు అన్నారు.         

Tags:    

Similar News