Breaking: గ్రూప్- 4 నియమాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్-4 నియమాకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-09-05 06:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న గ్రూప్-4 నియమాకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాల భర్తీ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేగాక నోటిఫికేషన్ లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో గ్రూప్- 4 నియామకాల భర్తీకి ప్రభుత్వం 2022 నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవడంపై సూర్యాపేటకు చెందిన దేవత్ శ్రీను సహా మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఈ పిటీషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

ఇందులో పిటిషనర్ తరపు న్యాయవాది.. జాతీయ న్యాయసేవాధికార సంస్థ వర్సెస్ కేంద్రం కేసులో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ల కల్పించాలని 2014 లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, అలాగే ట్రాన్స్‌జెండర్లకు హారిజాంటల్ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. గ్రూప్- 4 నియామకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున నియమాకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ దాఖలు చేసేందుకు 10 రోజుల సమయం కోరారు. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది. అంతేగాక ప్రస్తుతం చేపట్టబోయే నియామకాల ప్రక్రియ తుది తీర్పునకు లోబడే ఉంటుందని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


Similar News