బీజేపీ స్ట్రాటజీ చేంజ్.. ఎంపీ ఎన్నికల వేళ వారిపై ఫోకస్!
కేంద్రంలో మూడోసారి హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన బీజేపీ పార్టీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో మూడోసారి హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన బీజేపీ పార్టీ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఎఫెక్ట్, ప్రధాని మోడీ చర్మిస్మానే నమ్ముకోకుండా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపించే అంశాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించేందుకు తన స్ట్రాటజీనీ మార్చుకుంటోందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వే సంస్థల అంచనాలను తారుమారు చేస్తూ అనూహ్య ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్లో పట్టు నిలుపుకుంటూనే ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు చేరికలపై కమలనాథులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి నాటికి పార్టీలోకి భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూనే ఈ చేరికల విషయంలో భిన్నమైన నిర్ణయంతో ముందుకు సాగేలా ఆలోచనతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
పొలిటికల్ వాసన లేకుండా చేరికలు:
లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఈసారి ఏ మాత్రం ఏమరపాటు లేకుండా ప్లాన్ చేసుకోవాలని యోచిస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు సర్ ప్రైజ్ చేసినా నేతల మధ్య ఆధిపత్యపోరు స్పష్టంగా కనిపించింది. ఎన్నికలు సమీపించాక చేరికల విషయంలో కాషాయ శిబిరంలో ఏర్పడిన గందరగోలం పార్టీని మరింత డ్యామేజ్ చేసిందనే వాదన ఉంది. దీంతో ఈసారి అటువంటి వాటికి ఆస్కారం లేకుండా చేరికల విషయంలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని సామాజిక వేత్తలు, విద్యావేత్తలను పార్టీలోకి పెద్ద ఎత్తున ఆహ్వానించాలనే ప్రణాళికతో ఆ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వర్గాలను ఆకర్షించేలా ముందుగా రాజకీయాలతో సంబంధం లేని ఓ మాజీ అధికారిని రాజ్యసభకు పంపించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇతర పార్టీల్లోని లీడర్లను చేర్చుకోవడం ద్వారా ఆధిపత్య పోరు తప్ప పార్టీకి నష్టమే ఎక్కువగా ఉంటోందనే వాదన పార్టీలోని మెజార్టీ నాయకుల వాదన. దీంతో ఓ వైపు ఇతర పార్టీల నేతలను స్వాగతిస్తూనే నాన్ పొలిటిషియన్స్ కు పార్టీ ఎంట్రీ పాస్ ఇస్తే ప్రజల్లో పార్టీ పై పాజిటివ్ వైబ్స్ వస్తాయనే లెక్కలు వేసుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు అటువంటి వారిని అన్వేషించాలని పార్టీ నేతలకు హైకమాండ్ నుంచి ఆదేశాలు సైతం వెళ్లాయని దీంతో క్షేత్రస్థాయిలో పరిశీలనలు, చర్చలు సైతం జరుగుతున్నాయనే టాక్ నిపిస్తోంది.
కాంగ్రెస్ దూకుడుతో..:
రాష్ట్ర రాజకీయాల్లో పార్లమెంట్ ఎన్నికల మూడ్ స్పష్టంగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ సత్తా చాటేందుకు గట్టి వ్యూహాలే రచిస్తోంది. సెంటిమెంట్ తో కూడిన జలవివాదంపై ఫోకస్ పెట్టింది. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ పట్ల జరుగుతున్న అన్యాయానికి బీఆర్ఎస్, బీజేపీలే కారణం అని ఈ రెండు పార్టీలు గత పదేళ్లుగా అధికారంలో ఉండి సమస్యకు పరిష్కారం చూపలేకపోయాయనే వాదనను తెరమీదకు తెచ్చేలా అధికార పక్షం పావులు కదుపుతోంది. దీంతో ఇటువంటి సమయంలో రాష్ట్రంలోని సామాజిక వేత్తలు, మేధావులను పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఫలితాలు సానుకూలంగా మలుచుకోవచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. చెరికల విషయంలో తెలంగాణ బీజేపీ చేస్తున్న స్ట్రాటజీ మార్పు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి మరి.