BJP: హైదరాబాద్ టు అయోధ్య కొత్త సర్వీస్‌ల వివరాలు.. కేంద్ర మంత్రి ఆసక్తికర ట్వీట్

Update: 2024-09-27 13:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ టు అయోధ్య మధ్య వారానికి నాలుగు రోజుల విమాన సర్వీస్ నడవనుందని, ఉడాన్ పథకం కింద హైదరాబాద్ నుంచి ఒక్క నెలలో ఏడు సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి నడపనున్న కొత్త విమాన సర్వీసుల టైం టేబుల్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. నూతన విమానాశ్రయాలను అభివృద్ధి చేయడమే కాకుండా ఆయా పట్టణాలకు అతి తక్కువ ధరలోనే విమాన సర్వీసులను నడపడానికి అనుగుణంగా ఉడాన్ పథకంలో భాగంగా.. హైదరాబాద్ నగరం నుంచి ఒక్క నెలలోనే 7 నూతన విమాన సర్వీసుల ప్రారంభమయ్యాయని తెలిపారు.

అలాగే ఇందులో భాగంగా ఇవ్వాల్టి నుంచి (సెప్టెంబర్ 27) హైదరాబాద్ - కాన్పూర్ మధ్యన, హైదరాబాద్ నుంచి శ్రీరాముడు కొలువుదీరిన అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసును, రేపటినుంచి (సెప్టెంబర్ 28) హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్ - ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసులు ప్రారంభమయ్యాయని తెలిపారు. కాగా కేంద్రప్రభుత్వం ఉడాన్ పథకం కింద పలు ప్రాంతాల్లో కొత్త విమాన సర్వీసులను ప్రారంభించింది. అందులో హైదరాబాద్ నుంచి ఏడు సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కొత్త సర్వీసులు, ప్రయాణికులకు తక్కువ ధరలలో ప్రయాణం చేయడానికి, ఎక్కువ పట్టణాలకు విమాన సౌకర్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.



 



Similar News