DK Aruna : సిగ్గుండాలి.. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రేవంత్ చేసిన ట్వీట్‌పై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన చేశారు. సోనియా గాంధీ పుట్టిన రోజే అన్ని హామీలు అమలు చేస్తామని అన్నారని తెలిపారు. అధికారం వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ఆరోపించారు. ఒక్క ఇల్లు మొదలు పెట్టలేదని, కేంద్రం నిధులు లేకుండా వీళ్ళు ఇళ్లు కడతారా? అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ సగం మందికి కాలేదని, సిగ్గులేకుండా రేవంత్ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు.
పక్క రాష్ట్రం కర్ణాటకలో డీకే శివకుమార్ ఫ్రీ బస్ ఎత్తేస్తాం అంటున్నారని పేర్కొన్నారు. గ్రామాలకు బస్సులు బంద్ చేసి ఫ్రీ బస్ అంటున్నారని, అన్ని అమలు చేస్తున్నాం అనడానికి సీఎం రేవంత్‌కు సిగ్గు ఉండాలని తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల వైఫల్యాలు ఎత్తి చూపారని, రూ. 500 సిలిండర్‌లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ. 375, మరి మీరిచ్చేది ఎంత? అని ప్రశ్నించారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌లు అన్ని కేంద్రానీవే కదా అని నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను భ్రమలో ఉంచుతున్నారని, కానీ ప్రజలు మేల్కొన్నారు. అన్ని అర్థం చేసుకుంటారని వివరించారు. రైతు భరోసా లేదు, కౌలు రైతులకు, కూలీలకు సాయం దిక్కు లేదన్నారు. కాలేజీ చదివే అమ్మాయిలకు స్కూటీలు ఎటు పాయే అని ప్రశ్నించారు. 11 నెలల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ మాట పెద్ద బోగస్ అని, రూ. 10 లక్షల వైద్యం ఈ పది నెలల్లో ఎంతమందికి, ఎక్కడెక్కడ చేయించారో బయట పెట్టాలన్నారు. చెప్పిన మాట నిలబెట్టు కోకుండా దబాయించాలని చూస్తున్నారన్నారు. కొత్తగా ఒక పింఛను దరఖాస్తు కూడా తీసుకోలేదని, కొత్త వితంతు పింఛన్లు రాక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని సీఎంపై ఫైర్ అయ్యారు.