రఘునందన్ రావుకు ఎంపీ టికెట్ ఖరారయిందా?

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీజేపీ లీడర్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పార్లమెంట్ బరిలో నిలవనున్నారు.

Update: 2024-01-21 04:23 GMT
రఘునందన్ రావుకు ఎంపీ టికెట్ ఖరారయిందా?
  • whatsapp icon

దిశ బ్యూరో, సంగారెడ్డి: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీజేపీ లీడర్, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ పార్లమెంట్ బరిలో నిలవనున్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్టానం ఆయన పేరును దాదాపు ఖాయం చేసినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పార్టీలో డైనమిక్ లీడర్‌గా పేరు పొందిన ఆయనను బరిలో దింపడం ద్వారా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని అధిష్టాం భావిస్తున్నది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు మంచి సంబంధాలు ఉండడంతో ఆయన పోటీపై రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి నెలకొన్నది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా పార్లమెంట్ పరిధిలో రఘునందన్ రావు పేరుతో పెద్ద ఎత్తున భారీ హోర్డిం‌గ్‌లు వెలిశాయి.

ఎమ్మెల్యేగా ఓటమితో ఎంపీగా బరిలోకి..

బీజేపీలో రఘునందన్ రావు డైనమిక్ లీడర్‌గా చెప్పుకోవచ్చు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. అయితే అంతకు మందు గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 2లక్షల పై చీలుకు ఓట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎంపీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత వచ్చిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి రఘునందన్ రావు ఘనవిజయం సాధించిన విషయం కూడా విధితమే. కొంత కాలంగా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు సేవలందించిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు.

బలమైన అభ్యర్థిగా గుర్తించిన అధిష్టానం

మెదక్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెదక్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన మెదక్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఆ నేపథ్యంలోనే దుబ్బాక స్థానికుడైనప్పటికీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రఘునందన్ రావుకు మంచి గుర్తింపు ఉన్నది. గతంలో బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. బీజేపీ నుంచి కూడా ఉమ్మడి జిల్లాలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలను దెబ్బ కొట్టాలంటే రఘునందన్ రావును ఎంపీ బరిలో దింపడమే బాగుంటుందని పార్టీ అధిష్టానం లెక్కలు వేసినట్లు తెలిసింది. దాదాపుగా ఆయన పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్న వారు కూడా బలమైన లేకపోవడంతో రఘుందన్ రావు పేరు ఖాయమైనేట్లేనని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

పార్లమెంట్ పరిధిలో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు

అయోధ్య రామాలయం ప్రారంబోత్సం పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ పరిధిలో మునుపెన్నడూ లేని విదంగా రఘునందన్ రావు భారీ స్థాయిలో హోర్డింగ్ లు ఏర్పాటు చేయించారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు పరిధిలో భారీ స్థాయిలో హార్డింగ్ లతో పాటు రోడ్ల పక్కన ప్లెక్సీలు, పోస్టర్లు వేశారు. రఘునందన్ రావుకు మెదక్ ఎంపీ సీటు ఖాయమైందని అందుకే పార్లమెంట్ పరిధిలో భారీ స్థాయిలో హార్డింగ్ లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశామని ఆయన సన్నితులు చెబుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బలంగా ఢీకొనే లీడర్ పార్లమెంట్ పరిధిలో ఆయనే ఉన్నారంటున్నారు. రఘునందన్ రావు పేరు బీజేపీలో దాదాపు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు తమ అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి.

Tags:    

Similar News