టీ-కాంగ్రెస్ భారీ ప్లాన్.. రోజుకు లక్ష మందితో రాహుల్ యాత్ర!

రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఈ నెల 23న రాష్ట్రంలోకి వస్తుందని, ప్రతిరోజూ లక్ష మందితో యాత్ర నిర్వహిస్తామని AICC ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్

Update: 2022-10-20 11:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' ఈ నెల 23న రాష్ట్రంలోకి వస్తుందని, ప్రతిరోజూ లక్ష మందితో యాత్ర నిర్వహిస్తామని AICC ప్రొగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్, జోడోయాత్ర సమన్వయ కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్​రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో జోడో యాత్ర మొబలైజేషన్, జన సమీకరణ, సమన్వయంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్​దీనిపై సమీక్షించారు. ఈ సందర్భంగా జన సమీకరణ, సమన్వయంపై వివరించారు. అనంతరం మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ జోడో యాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని, 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేరచిన మహానేతకు ప్రజలు బ్రహ్మరథం పడుతారన్నారు. దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ నేతలు చేయలేని సుదీర్ఘ పాదయాత్రను రాహుల్​ గాంధీ చేస్తున్నారని, చరిత్రలో ఈ యాత్ర నిలిచిపోతుందన్నారు.

రాష్ట్రంలో 375 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని, ప్రతి రోజూ సాయంత్రం కార్నర్ మీటింగ్స్ ఉంటాయని, లక్ష మందితో రాహుల్ గాంధీని ఇంటరాక్షన్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. యాత్రకు వచ్చే వారితో పాటుగా పాదయాత్రలో ప్రజలు రాహుల్ గాంధీని కలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ యాత్రలో మొబిలైజేషన్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుందని, మక్తల్​నుంచి జుక్కల్ వరకు సాగే యాత్రలో పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు పాదయాత్ర ప్రారంభం అవుతుందని, ఉదయం 5 గంటల నుంచి ప్రజలు యాత్రకు సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని, ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక రిసీవింగ్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక బాధ్యత తీసుకుని పని చేస్తున్నారని, మిగిలిన నేతలంతా జోడో యాత్ర బాధ్యతలు తీసుకున్నామని, ఈ యాత్రను సక్సెస్ చేస్తామని, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ గెలుస్తామని మహేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రెటరీ నదీం జావిద్ తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News