BIG News: మారని రిటైర్డ్ ఎంప్లాయిస్ తీరు.. మళ్లీ ఊపందుకున్న పైరవీలు!
రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుని 24 గంటలు గడవకముందే పైరవీల పర్వం మొదలైంది.
దిశ, తెలంగాణ బ్యూరో: రిటైర్డ్ అధికారులను ఇంటికి పంపించాలని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుని 24 గంటలు గడవకముందే పైరవీల పర్వం మొదలైంది. తమను మళ్లీ సేమ్ పొజిషన్‌లో కొనసాగించాలని రిటైర్డ్ ఆఫీసర్లు పైరవీలు ప్రారంభించారు. హెచ్ఓడీలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొందరు హెచ్ఓడీలే సదరు రిటైర్డ్ ఆఫీసర్ల సేవలు తమ ఆఫీసుకు కావాలంటూ ఏకంగా సర్కారుకు లేఖలు రాస్తున్నారు. ఈ వ్యవహారం వెనుక ఏదో మతలబు ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
లాబీయింగ్ షురూ..
బీఆర్ఎస్ సర్కారు హయాంలో వివిధ శాఖల్లో రీ అపాయింట్మెంట్ అయిన సుమారు వెయ్యి మంది రిటైర్డ్ ఆఫీసర్లు, గులాబీ లీడర్లతో క్లోజ్‌గా ఉంటున్నట్టు ఆరోపణలున్నాయి. వీరంతా ఆయా శాఖల్లోని కీలక సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా గులాబీ నేతలకు చేరవేస్తున్నారని విమర్శలు సైతం వచ్చాయి. దీంతో పదవీ విరమణ చేసి సర్వీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ఎవరైనా రిటైర్డు ఆఫీసర్ల సేవలు తప్పనిసరి అని భావిస్తే, అందుకు సరైన కారణాలు చూపి ప్రభుత్వానికి రిపోర్టు చేయాలి. అటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఒక రిటైర్డ్ అధికారి సేవలు కావాలని కమిషనర్/డైరెక్టర్ నిర్ణయం తీసుకుంటే, సదరు ఆఫీసర్‌ను ప్రభుత్వం కంటిన్యూ చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని చాలా మంది తమను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలంటూ హెచ్ఓడీల ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. తమకు సన్నిహితులైన కాంగ్రెస్ లీడర్ల ద్వారా పైరవీలు చేయిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ వ్యవహారం వెనుక ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
రిటైర్డ్ ఆఫీసర్లకు హెచ్ఓడీల మద్దతు..
కొందరు హెచ్ఓడీలు తమకు అనుకూలంగా వ్యవహరించే రిటైర్డ్ ఆఫీసర్లను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సదరు ఆఫీసర్ సేవలు కావాలని, తమకు ఉన్న విచక్షణాధికారంతో ప్రభుత్వానికి నివేదికలు రాస్తున్నట్టు తెలుస్తున్నది. అనుకూలమైన అధికారులు తమ కింద పనిచేస్తే తమ వ్యవహారాలు గుట్టుచప్పుడు కాకుండా కొనసాగించుకోవచ్చనే ఉద్దేశ్యంతో పలువురు హెచ్ఓడీలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారాలు ప్రధానంగా మున్సిపల్ శాఖలో జరుగుతున్నట్టు టాక్. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ శాఖలో సుమారు 170 మంది ఇంటికి వెళ్లాలి. కానీ, కొందరు హెచ్ఓడీలు తమకు అనుకూలంగా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి రికమెండ్ చేసినట్లు చర్చ జరుగుతున్నది.
ఈఎన్సీ వినతి.. సీఎంకు మంత్రి సీతక్క లేఖ
కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రిటైర్డ్అధికారులు, ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే గతేడాది సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఏ శాఖలో ఎంత మంది రిటైర్డ్ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారో డేటాను సేకరించారు. ఈ క్రమంలోనే పీఆర్ఇంజినీరింగ్ విభాగం ఈఎన్‌సీ స్థానంలో రిటైర్డ్అధికారి సంజీవరావు ఉండగా.. ఆయన స్థానంలో కనకరత్నంను నియమించారు. ఈనెల 31న కనకరత్నం రిటైర్డ్అవుతున్నారు. ఈ నేపథ్యంలో రిటైర్కాబోతున్న తనను మరో 2 ఏండ్లు ఈఎన్‌సీగా కొనసాగించాలని కనకరత్నం ఆ శాఖ మంత్రి సీతక్కకు విజ్జప్తి చేశారు. ఆయన వినతి మేరకు సీఎం రేవంత్‌కు సీతక్క లేఖ రాశారు. ఇప్పటికే రిటైర్అయిన వారిని తొలగిస్తున్న తరుణంలో ఈఎన్‌సీ కొనసాగింపుపై సీఎం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.