Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ కుమారుడి అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది.
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు జోరు పెంచుతున్నాయి. తాజాగా ఈ కేసులో ఈడీ అధికారులు వైఎస్ఆర్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట్ల రాఘవ రెడ్డిని అరెస్ట్ చేసారు. దేశ రాజధానిలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించి రాఘవ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో పలుమార్లు సమావేశమైనట్టు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇటీవలే సీబీఐ అధికారులు గతంలో కల్వకుంట్ల కవితకు ఆడిటర్‌గా వ్యవహరించిన సీ ఏ గోరంట్ల బుచ్చిబాబు ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఆయనను అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్ట్ చేసింది. మరుసటి రోజు చారియట్ మీడియా సంస్థ అధినేత రాజేశ్ జోషిని ఈడీ అరెస్ట్ చేసింది. అంతకు ముందు డిసెంబర్ 12న సీబీఐ అధికారులు కవితను ఈ కేసుకు సంబంధించి ఏడు గంటలపాటు ప్రశ్నించారు. సౌత్ గ్రూప్‌లో ఉన్న కవిత ఈ స్కాంలో భారీ మొత్తాల్లో కిక్ బ్యాక్ రూపంలో డబ్బు అందుకుందన్నదని సీబీఐ ఆరోపించింది. వరుస అరెస్ట్‌ల నేపథ్యంలో లిక్కర్ స్కాంలో తదుపరి ఎవరిపై చర్యలుంటాయనే విషయంలో టెన్షన్ నెలకొంది.