BIG BREAKING: వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల మార్పునకు కేంద్రం ఆమోదం.. ఇక ‘టీఎస్’ నుంచి ‘టీజీ’
వాహనాల రిజిస్ట్రేషన్‌లో ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ‘ని చలామణిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: వాహనాల రిజిస్ట్రేషన్‌లో ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ‘ని చలామణిలోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. అనంతరం ఆ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఈ మేరకు తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు తాజాగా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీజీకి మార్చడానికి ఇటీవల జరిగిన మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియకు సంబంధించి అధికారులు కేంద్ర రవాణా శాఖతో సంప్రదింపులు జరిపారు. దీనికి తాజాగా కేంద్రం ఆమోద ముద్ర వేసింది. దీంతో తెలంగాణలో ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్లు ‘టీజీ’తో మొదలవనున్నాయి.
కాగా, నెంబర్ ప్లేట్ల మార్పు కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు వర్తింపజేస్తారు. టీఎస్ నంబర్ ప్లేట్‌లతో కూడిన వాహనాలు అలాగే కొనసాగుతాయి. రోడ్లపైకి వచ్చే కొత్త వాహనాలు రాష్ట్రంలో ‘టీజీ’ రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్‌లను కలిగి ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్‌గా మార్చాలని కోరింది. తెలంగాణ అనేది ఒక్క పదమే అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని టీజీగా మార్చాలని కోరుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లపై టీఎస్ నుంచి టీజీకి మార్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.