మెట్రోరైల్‌లో బిచ్చమెత్తిన గ్రాడ్యుయేట్స్

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిందని గ్రాడ్యుయేట్లు వినూత్నంగా నిరసన చేపట్టారు.

Update: 2022-12-17 06:44 GMT

దిశ, శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేసిందని గ్రాడ్యుయేట్లు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు అనేక వాగ్ధానాలు చేసి ఓట్లు దండుకుని గెలిచి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్లు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో బిక్షాటన చేశారు.

పట్టభద్రులమైనా తమకు కేసీఆర్ సర్కారు ఉద్యోగాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఎన్నికల్లో ఇస్తామన్న నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని మెట్రో ప్రయాణీకుల వద్ద బిచ్చమెత్తారు. ఈ సందర్భంగా మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాలా హరీష్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారని నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులలో, బంధువులలో ఒక్కరైన బలిదానం చేశారా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎవరూ కూడా ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ జిల్లా సెక్రెటరీ విజీత్ వర్మ, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, బీజేపీ, బీజేవైఎం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.

Also Read...

డయాలసిస్ సేవల్లో తెలంగాణ టాప్ : హరీష్ రావు 


Similar News