కాంగ్రెస్ అసంతృప్త నేతలతో Bandi Sanjay రహస్య భేటీ!

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునే పనిలో కమలం పార్టీ తలమునకలైంది.

Update: 2022-12-19 11:11 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను అనుకూలంగా మార్చుకునే పనిలో కమలం పార్టీ తలమునకలైంది. హస్తం పార్టీలో ఏర్పడిన చీలికను కాషాయ పార్టీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. సీనియర్లు వర్సెస్ రేవంత్ వర్గంలో రేగిన చిచ్చుతో బీజేపీ ఆపరేషన్ ఆకర్స్‌ను మొదలుపెట్టింది. ఈ చేరికల వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వద్దకు చేరింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు తాము బీజేపీలో చేరుతామని కమలం లీడర్లకు ఫోన్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వంతో ఇప్పటికే మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ హామీ ఇస్తే చేరేందుకు సిద్ధమని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి రిక్వెస్ట్ పెట్టినట్లుగా వినికిడి. పలువురు నేతలతో భేటీ కావడానికి బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు హుటాహుటిన బయల్దేరారు.

కాంగ్రెస్ అసంతృప్తి నేతలతో బండి సంజయ్ రహస్యంగా భేటీ అయి ఇప్పటికే ఒక దఫా చర్చలు సాగించినట్లు సమాచారం. కాగా ఇంకొందరితో మంతనాలు జరిపిందుకు బండి సంజయ్ కరీనంగర్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. చర్చలు సఫలమైతే బీజేపీలో చేరబోయే కాంగ్రెస్ నేతలను ఆయన వెంట ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగుతన్నట్లు తెలుస్తోంది. వెంటనే పార్టీలోకి చేర్చుకుని కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని చూస్తోంది. తెలంగాణలో బలహీనం చేస్తే టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందనే మెసేజ్‌ను ప్రజల్లోకి పంపించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడంపై దృష్టిసారిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం హస్తం పార్టీ నేతల సమన్వయ బాధ్యతలను కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన లీడర్లకు అప్పగించింది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో బీజేపీ సీనియర్ నాయకురాలు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.

ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరదీసిన కాషాయదళానికి కాంగ్రెస్ అంతర్గత కలహాలు అస్త్రంగా మారింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడిని నిజం చేస్తూ కాషాయ పార్టీ చేరికలపై యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకుంది. రేవంత్ రెడ్డికి వ్యతిరేక వర్గమంతా ఇప్పటికే ఏకతాటిపైకి వచ్చింది. తిరుగుబాటుకు సిద్ధమైన 9 మంది నేతల్లో పలువురు బీజేపీ నేతలకు టచ్‌లోకి వెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో వినికిడి. ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంతనాలు జరిపినట్లు టాక్. ఈ ఇద్దరితో పాటు మరో ఇద్దరు నేతలతో కాషాయ పార్టీ సీనియర్ నాయకురాలు సైతం చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లంతా బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి బీజేపీ నేతలు చేపడుతున్న మంతనాలు కొలిక్కి వస్తే చేరికలు లాంఛనంగా జరగనున్నాయి. కాంగ్రెస్ బలహీనమవుతోందనే సంకేతాలు వస్తే మరికొందరు నేతలు కూడా చేరుతారని బీజేపీ భావిస్తోంది. మరి కాషాయ నేతలు జరుపుతున్న చర్చలు సఫలమవుతాయా? హస్తం పార్టీలో అలకబూనిన నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారా? అనేది వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి : 
 

                         T- కాంగ్రెస్ వివాదం.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంకా గాంధీ ఫోన్ కాల్..!

Tags:    

Similar News