కవిత నోటీసులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తెలంగాణ సమాజం, తెలంగాణ తలవంచదని డ్రామాలాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

Update: 2023-03-08 07:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా తెలంగాణ సమాజం, తెలంగాణ తలవంచదని డ్రామాలాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి కవిత తెలంగాణ ఆత్మగౌరవం పేరును ఎత్తుకుందని ధ్వజమెత్తారు. బుధవారం నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో మహిళా దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బిల్లులో కీలకపాత్ర పోషించిన దివంగత కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం లిక్కర్ స్కాంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ఈ కేసులో కవిత తప్పు లేకుంటే కోర్టులో నిరూపించుకోవాలన్నారు.

కవిత లిక్కర్ దందా తన కుంటుంబం కోసం చేసిందా లేక తెలంగాణ సమాజం కోసం చేసిందా అని ప్రశ్నించారు. మీరు చేసే అడ్డగోలు దందాలన్నింటికి తెలంగాణ సమాజానికి అంటగడితే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబ చరిత్ర ఏంటో అందరికీ తెలుసని, దర్యాప్తు సంస్థలకు బీజేపీతో ఏం సంబంధం అన్నారు. కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేస్తూ తెలంగాణ సమాజం తలవంచదంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ కవిత చేసిన దుర్మార్గపు చర్యలను ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయంపై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన బండి సంజయ్.. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్తకొత్త డ్రామాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు.

ఆ అర్హత బీఆర్ఎస్ కు లేదు:

మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని బండి సంజయ్ అన్నారు. ఆ పార్టీలో మహిళ విభాగమే లేదని, బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు ఎవరో తెలియదన్నారు. మహిళ వ్యతిరేకి ఈ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శిచారు. రాష్ట్రంలో 17 శాతం హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని ఎన్ సీఆర్బీ లెక్కలే చెబుతున్నాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతుంటే కేసీఆర్ ప్రభుత్వం మౌనం వహిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్టీ మహిళ అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోడీదన్నారు. మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హతే బీఆర్ఎస్ కు లేదన్నారు. తన బిడ్డ కవిత ఒక్కరే మహిళ అని సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని నిజానికి ఎంతో మంది మహిళలు ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిని తమ జీవితాలను త్యాగం చేశారని అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్సీ ఇవ్వరా అని నిలదీశారు.

Tags:    

Similar News