Balapur laddu: మరోసారి రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు
హైదరాబాద్‌లో కదిలె తొలి వినాయకుడు.. బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డూ వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్(Balapur) గ్రామం బొడ్రాయి వేదికయ్యింది.
దిశ, బడంగ్పేట్: హైదరాబాద్‌లో కదిలె తొలి వినాయకుడు.. బాలాపూర్ గణపతి 21 కిలోల లడ్డూ వేలం పాటకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్గ్రామం బొడ్రాయి వేదికయ్యింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట వేలాది మందిభక్త జన సందోహం నడుమ కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్, సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డి(అర్బన్గ్రూప్), నాదర్‌గూల్‌కు చెందిన గీతా డైరీ లక్ష్మీనారాయణ, బాలాపూర్‌కు చెందిన కొలను శంకర్‌రెడ్డి మధ్య పోటాపోటిగా లడ్డూ వేలం కొనసాగింది. రూ.1016 తో ప్రారంభమై వేలం పాటలో.. బాలాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కొలను శంకర్ రెడ్డి రూ. 30,01,000 లకు 21 కిలోల లడ్డూను సొంతం చేసుకున్నారు.
దీంతో 31వ సారి బాలాపూర్ లడ్డూ(Balapur laddu) వేలం పాటలో దక్కించుకున్న జాబితాలో కొలను శంకర్ రెడ్డి చేరిపోయారు. 44 వసంతాల గణేష్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గత 30 సంవత్సరాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్గణేష్ లడ్డూ వేలం పాటకు తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ, ప్రపంచ వ్యాప్తంగా విశిష్ఠ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2020 లో బాలాపూర్ గణపతి లడ్డు వేలం పాటను రద్దు చేశారు. దీంతో ఆ లడ్డూను అప్పట్లో బాలాపూర్గ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్‌రెడ్డి బృందం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహుకరించారు. 2021 లో జరిగిన వేలం పాట కంటే 2022లో 5.70 లక్షలు రెట్టింపు, 2022 లో జరిగిన వేలం పాట కంటే 2023 లో 2.40 లక్షలు పలకగా.., 2023 లో జరిగిన వేలం పాట కంటే ఈ యేడు మూడు లక్షలు అధిక ధర పలికింది.
బాలాపూర్లడ్డూ వేలం పాట చరిత్రలో ఈ యేడు రికార్డు బ్రేక్ చేసింది. లడ్డు వేలం పాటలో గడిచిన 30 ఏళ్లలో 1,82,51,950కోట్ల రూపాయలు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి సొంతం కాగా అందులో ని 1,58,07,970 కోట్ల రూపాయలతో బాలాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అయితే గత సంవత్సరం 2023లో బాలాపూర్ గణేష్ లడ్డు ను వేలం పాటలో దక్కించుకున్న దాసరి దయానంద్ రెడ్డి రూ. 27 లక్షల నగదు ను గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి కి అందజేశారు. నగదు ను అందజేసిన దాసరి దయానంద్ రెడ్డికి గణేష్ ఉత్సవ సమితి తరపున లక్ష రూపాయల విలువ గల బంగారు చైన్‌ను అందజేశారు.
తెల్లవారుజామున 5 గంటలకే ప్రారంభమైన నిమజ్జనం పూజలు..
తెల్లవారుజామున 5 గంటల నుంచి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి(Balapur Ganesh Utsava Samiti) ఆధ్వర్యంలో నిమజ్జన పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం బాలాపూర్ గణేష్ మండపం నుంచి బాలాపూర్ (Balapur)పురవీధుల గుండా సన్నాయి మేళాలు .. భజన కార్యక్రమాల నడుమ బాలాపూర్ గణపతి ఊరేగింపుగా ముందుకు కదిలింది. దారిపొడవునా బాలాపూర్ గ్రామస్థులు కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతులు పట్టారు. 10.15 గంటల ప్రాంతంలో బాలాపూర్ గణపతి డీసీఎం వ్యాన్‌లో బొడ్రాయి వద్దకు చేరుకుంది. ఉదయం 10.35 గంటలకు బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట అట్టహాసంగా ప్రారంభమైంది.
హాజరైన ప్రముఖులు..
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ తీగల హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, కార్యదర్శి శశిధర్, ప్రధాన కార్యదర్శి రాజ వర్ధన్ రెడ్డి, పీసీసీ కార్యదర్శి వై. అమరేందర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు కొలను శంకర్ రెడ్డి(BJP leaders kolanu Shankar Reddy), దైవాజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
బాలాపూర్ లడ్డూను ప్రధాని మోడీకి అందిస్తాం: శంకర్ రెడ్డి
బాలాపూర్గణేష్ లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని బీజేపీ నేత కొలను శంకర్ రెడ్డి అన్నారు. వేలం పాటలో దక్కించుకున్న లడ్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ(Indian Prime Minister Narendra Modi)కి బహూకరిస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఎలాగైనా లడ్డూను సొంతం చేసుకుందామని వేలంపాటలో పాల్గొన్నానని, అదృష్టానికి 2024 లో రూ. 30,01,000 లకు సొంతం చేసుకున్నట్లు కొలను శంకర్ రెడ్డి పేర్కొన్నారు.