కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో AEE అభ్యర్థులకు తీవ్ర అన్యాయం: బక్క జడ్సన్ ఫైర్
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ ఫలితాలు వెలువడినా.. ఇంతవరకు అర్హత పొందిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ ఫలితాలు వెలువడినా.. ఇంతవరకు అర్హత పొందిన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ఎమ్మెల్సీ బక్క జడ్సన్ ఆరోపించారు. ఆదివారం బక్క జడ్సన్‌ను ఏఈఈ అభ్యర్థులు కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా జడ్సన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పేపర్ లీకేజీ వలన రెండు సార్లు ఎగ్జామ్స్ రాయడం జరిగిందని, మెరిట్ లిస్ట్ కోసం మూడు నెలలు టీఎస్‌పీఎస్సీ చుట్టూ అభ్యర్థులు తిరిగారని మండిపడ్డారు.
హరిజాంటల్ రిజర్వేషన్ కోర్ట్ కేసుల వల్ల అభ్యర్థులే స్వయంగా డబ్బులు జమచేసి ఆరు నెలలు తిరిగి కోర్ట్ కేసులు పరిష్కరించుకున్నరన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అడగని మినిస్టర్ లేడు తొక్కని గడప లేదని.. అభ్యర్థులు జడ్సన్‌తో తమ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ధర్నాలు, ఇందిరా పార్క్ నిరసనలు, టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తులు చేయగా మార్చిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేశారని, ఇప్పటికి రెండు నెలల కావస్తున్న తుది ఫలితాలు, అపాయింట్ ఆర్డర్స్ ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారని జడ్సన్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిసారి 30000 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నప్పటికీ టీఎస్‌పీఎస్సీ నుండి ఇప్పటివరకు ఒక్క ఉద్యోగానికి కూడా నియామక ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. కొత్త ప్రభుత్వం వల్ల ఎలాంటి ఏఈఈ అభ్యర్థులకు న్యాయం జరుగలేదన్నారు.