లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేసేందుకే జర్నలిస్టులపై దాడులు: మాజీ MP వివేక్
లిక్కర్ స్కాం దర్యాప్తుపై ఎప్పుడేం జరుగుతుందోననే ఆసక్తి ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయిందని, ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆసక్తికర కామెంట్లు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కాం దర్యాప్తుపై ఎప్పుడేం జరుగుతుందోననే ఆసక్తి ప్రజల్లో విపరీతంగా పెరిగిపోయిందని, ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆసక్తికర కామెంట్లు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అటు లిక్కర్ స్కామ్, ఇటు పేపర్ లికేజీతో కల్వకుంట్ల కుటుంబంపైనే చర్చంతా కొనసాగుతోందని, కుటుంబ ప్రతిష్టతో పాటు బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా రోజురోజుకూ పడిపోతోందని భావించే ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అందులో భాగంగానే జర్నలిస్టులపై దాడులు, అరెస్టులు జరుగుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణలో గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయనే విషయం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అర్థమైందని, ఈ విషయంతో పాటు కేసీఆర్ సర్కార్ అవినీతిపై పలు మీడియా ఛానళ్లు ప్రశ్నిస్తున్నాయని, అందుకే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వారందరికీ తాము అండగా ఉన్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.