‘పుస్తకాలకు అవినీతి చెదలు’.. డీకే పబ్లిషర్స్‌పై అసోసియేషన్ ఫైర్!
గతేడాది చోటుచేసుకున్న ప్రాక్టికల్ ఇబ్బందులతో ఈసారి జనవరిలోనే పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాది చోటుచేసుకున్న ప్రాక్టికల్ ఇబ్బందులతో ఈసారి జనవరిలోనే పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థ (ఎల్-1) ఇంకా ప్రింటింగ్ చేపెట్టకపోవడంపై తెలంగాణ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ ఆసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సేల్స్’ కేటగిరీ కింద టెండర్ దాఖలు చేసిన డీకే పబ్లిషర్స్ రెండు ప్రింటింగ్ మెషీన్లు ఉన్నట్లు పేర్కొన్నదని, కానీ ఇప్పటికీ వాటిని ఫంక్షనింగ్‌లో పెట్టలేదని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శికి ఈ వారం రాసిన రాతపూర్వక ఫిర్యాదులో అసోసియేషన్ ప్రస్తావించింది. ఎల్-1 సంస్థగా నిలిచినప్పటికీ రాష్ట్ర టెక్స్ట్‌బుక్ ప్రెస్ డైరెక్టర్ నిర్దేశించిన తరహాలో పుస్తకాలను ముద్రించి సరఫరా చేయలేదని ఆరోపించింది. నిబంధనలను పాటించని ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
విద్యాశాఖ అధికారుల ప్రభావితం
గతేడాది ‘సేల్స్’ కేటగిరీ కింద ముద్రించే పాఠ్యపుస్తకాలకు రాయల్టీని ఫిక్స్ చేయడం మొదలు పలు అంశాల్లో ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో జాప్యం జరిగిందని, ఈసారి ముందుగానే ప్రాసెస్ మొదలైందని, మొత్తం 11 సంస్థలు టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్‌కు అర్హత సాధించాయని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి గుర్తుచేశారు. ఎల్-1 సంస్థగా నిలిచిన డీకే పబ్లిషర్స్ మినహా మిగిలిన పది ప్రింటింగ్ సంస్థలు యధావిధిగా పాఠ్యపుస్తకాలను ముద్రించాయన్నారు. వర్క్ ఆర్డర్ ప్రాసెస్ మొదలై దాదాపు నెల కావస్తున్నా ఎల్-1 ఇప్పటికీ ప్రింటింగ్ స్టార్ట్ చేయకపోవడాన్ని తప్పుపట్టాయి. దీనికి తోడు విద్యాశాఖ అధికారులను ప్రభావితం చేసేలా ఆరోపణలు చేయడాన్ని అసోసియేషన్ తరఫున వెంకటరెడ్డి ఖండించారు.
ఫైనాన్స్ డిపార్టుమెంటను బ్లాక్ మెయిల్ చేసే ధోరణి
‘సేల్స్’ కాంపొనెంట్ మాత్రమే కాకుండా ‘ఫ్రీ టెక్స్ట్ బుక్’ విభాగంలోనూ టెండర్ దాఖలు చేసిన డీకే పబ్లిషర్స్ ప్రభుత్వ విద్యాశాఖను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిందని అసోసియేషన్ ఆ కంప్లైంట్‌లో పేర్కొన్నది. టెండర్ దాఖలు చేసే సమయానికి ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రెండు సంస్థలున్నాయని, ఐదు ప్రింటింగ్ మెషీన్లు ఉన్నాయని పేర్కొన్నదని, కానీ టెక్నికల్ బిడ్ వేసిన తర్వాత దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు మారినట్లు చెప్పిందని, ఇప్పటికీ ప్రింటింగ్ మెషీన్లను అసెంబుల్ చేయలేదని ఆరోపించింది. కేవలం మెషినరీ లేనందువల్లనే ఇప్పటికీ వర్క్ ఆర్డర్‌ను తీసుకోలేదని, మిగిలిన పది ప్రింటింగ్ ప్రెస్‌లు ఆర్డర్‌ను తీసుకోవడంతో పాటు పుస్తకాల ప్రింటింగ్ ప్రక్రియనూ పూర్తిచేశాయని ఆ ఫిర్యాదులో వివరించారు.
టెండర్ దరఖాస్తుల్లో ప్రింటింగ్ మెషీన్లు ఉన్నట్లు పేర్కొన్న డీకే పబ్లిషర్స్... ప్రింటింగ్ అయిపోయిన తర్వాత ఆ బుక్స్ ను స్టోర్ చేయడానికి తగినస్థలం కూడా లేదని గుర్తుచేసింది. ‘ఫ్రీ బుక్స్’ కాంపొనెంట్‌లో డీకే పబ్లిషర్స్ మాత్రమే అర్హత పొందిందని, బిల్లులను క్లియర్ చేసుకోవడంలో ఫైనాన్స్ డిపార్టుమెంటును కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నదని అసోసియేషన్ ఆరోపించింది. కొద్దిమంది ప్రైవేటు ప్రింటర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయని, ఇందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పలుకుబడి ఉన్నదనే అంశాన్ని కూడా వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ఫిర్యాదులో కార్యదర్శి వెంకటరెడ్డి ప్రస్తావించారు. ఇలాంటి ఒత్తిడితో మిగిలిన ప్రింటర్లకు ఫైనాన్స్ డిపార్టుమెంటు నుంచి సకాలంలో బిల్లులు రాకుండా ఆలస్యమవుతున్నదని పేర్కొన్నారు.
టెండర్ ప్రక్రియ జరిగింది ఇలా...
సేల్స్ కాంపొనెంట్ కింద పాఠ్యపుస్తకాలను ముద్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్ కార్యాలయం టెండర్ ప్రక్రియను మొదలుపెట్టింది. షెడ్యూలు ప్రకారం జనవరి 13న ఓపెన్ అయిన ప్రక్రియ ఫిబ్రవరి 8 నాటికి ముగిసింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం మొత్తం 11 సంస్థలు అర్హత సాధించాయి. అందులో దేవరకొండ కాళిదాస్ యజమానిగా ఉన్న డీకే పబ్లిషర్స్ అతి తక్కువ ధరను కోట్ చేయడంతో ఎల్-1 సంస్థగా నిలిచింది. ముద్రణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌ల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వర్క్ ఆర్డర్‌ను సైతం ఖరారు చేసింది. ఆ ప్రకారం డీకే పబ్లిషర్స్ ప్రెస్ మొత్తం 12.84 లక్షల పాఠ్య పుస్తకాలను ముద్రించాల్సి ఉన్నది.
ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను ‘సేల్స్’ కేటగిరీ కింద ముద్రించడం వీటి బాధ్యత. పేపర్ కొనుగోలు మొదలు నిర్దిష్ట ప్రమాణాలతో మొత్తం ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేసి కాంట్రాక్టు విలువలో 5 శాతాన్ని ప్రభుత్వానికి రాయల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. తొలుత ప్రభుత్వ ప్రెస్ డైరెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం మార్చి 31న వర్క్ ఆర్డర్ అందుకున్న మరుసటి రోజు నుంచే ప్రింటింగ్ ప్రక్రియను మొదలుపెట్టి ఏప్రిల్ 27వ తేదీకల్లా ముగించాల్సి ఉన్నది. పది ప్రైవేటు ప్రెస్‌లు ఆ షెడ్యూలు ప్రకారం పూర్తిచేశాయని అసోసియేషన్ వివరించింది. ఈ అసోసియేషన్‌లోనే మెంబర్‌గా ఉన్న డీకే పబ్లిషర్స్ (ఎల్-1 ప్రెస్) మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఆ సంస్థకు అప్పగించిన 12.84 లక్షల బుక్స్ ప్రింటింగ్ కోటాను ఇతర ప్రెస్‌లకు కేటాయించడంపై త్వరలో నిర్ణయం జరగనున్నది.
‘డీకే పబ్లిషర్స్’పై వేటు
‘సేల్స్’ కాంపొనెంట్ కింద ఎల్-1గా నిలిచిన డీకే పబ్లిషర్స్ ప్రింటర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. అతి తక్కువ ధరతో టెండర్‌లో మొదటి సంస్థగా స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ వర్క్ ఆర్డర్‌ను తీసుకోకపోవడాన్ని తప్పుపట్టింది. నిబంధనల ప్రకారం 12,84,761 పాఠ్యపుస్తకాలను ముద్రించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉన్నప్పటికీ దాదాపు నెల రోజులవుతున్నా అది వర్క్ ఆర్డర్‌ను తీసుకోలేదని ప్రభుత్వ టెక్స్ట్ బుక్ ప్రెస్ డైరెక్టర్ ఈ నెల 25న జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెండరు నిబంధనల ప్రకారం ఆయన వర్క్ ఆర్డర్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు. డిపాజిట్‌గా చెల్లించిన రూ. 20 లక్షలను కూడా జప్తు చేసినట్లు వెల్లడించారు.
వర్క్ ఆర్డర్ ప్రకారం సెక్యూరిటీ డిపాజిట్ రూపంలో రూ. 75.88 లక్షలను, రాయల్టీ (5%) కింద రూ. 75.88 లక్షలను చెల్లించాల్సి ఉన్నదని, కానీ ఈ రెండింటినీ డీకే పబ్లిషర్స్ ఉల్లంఘించిందని తెలిపారు. వర్క్ ఆర్డర్ తీసుకోకపోవడం, అగ్రిమెంట్ కుదుర్చుకోకపోవడంపై ఆ సంస్థకు పలుమార్లు నోటీసులు ఇచ్చామని, చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని కూడా అడిగామని గుర్తుచేశారు. సకాలంలో స్పందన రాలేదని గుర్తుచేశారు. చివరకు వచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, ఆ కారణంగానే ఆ సంస్థ డిపాజిట్‌ను జప్తు చేసుకోవడంతో పాటు ప్రింటింగ్ బాధ్యతలను రద్దు చేసినట్లు డైరెక్టర్ శ్రీనివాసాచారి ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.