సీఎం కేసీఆర్‌కే టఫ్ ఫైట్.. ఆ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి..
దిశ, నిజామాబాద్ ప్రతినిధి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. 9 నియోజకవర్గాల్లోపోలింగ్ శాతం తక్కువ నమోదు కావడం పార్టీలను కలవరపెడుతుంది. అన్నీ నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ జరిగిందని అంతా అనుకున్నారు. కానీ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో రావడంతో అధికార పార్టీకి మింగుడు పడడం లేదు. మరోవైపు రెండు, మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని సర్వేలు తేల్చడంతో అసలు రుచించడం లేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 8 స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అధికార పార్టీలో చేరడంతో పార్టీ బలం 9కి చేరుకుని జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్లయింది.
అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే సరికి 9 మంది సిట్టింగ్‌లకే సీఎం కేసీఆర్ టికెట్లు ఖరారు చేశారు. సర్వేలు, అంచనాలు ప్రభుత్వ పని తీరును పరిగణలోకి తీసుకుని మళ్లీ వారినే గెలిపించాలంటూ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు జోరుగా ప్రచారం చేశారు. తీరా ఎన్నికల సరళి ముగించే పోలింగ్ శాతం లెక్కలు కట్టే సమయంలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అధికార పార్టీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతానికి 9 మంది సిట్టింగ్‌లు ఉండగా అక్కడ మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడవ స్థానంలో బీజేపీ ఉండడంతో అధికారం కోల్పోయే సీట్లన్నీ బీఆర్‌ఎస్సే కావడంతో ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆందోళన పెరిగింది.
9 స్థానాల్లో బీఆర్ఎస్కు గట్టి పోటీ
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 9 స్థానాల్లో అధికార బీఆర్ఎస్‌కు గట్టి పోటీని ఇచ్చిందని చెప్పాలి. అదే విధంగా బీజేపీ కూడా రెండు, మూడు స్థానాల్లో పోటీ ఇవ్వడంతో అధికార పార్టీలో ఏ సిట్టింగ్ స్థానం గల్లంతవుతుందోనని ఆందోళన వ్యక్తమౌతుంది. కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి జిల్లాలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ వేనని మౌత్ టాక్ ఉంది. అదే విధంగా సర్వేలు కూడా అనుకూలంగా వచ్చాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అర్బన్ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తకు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ, బీజేపీ తరపున బరిలో నిలిచిన ధన్ పాల్ గట్టి పోటీనిచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరు గట్టెక్కుతారని పోలింగ్ సరళిని అందరూ అంచనా వేస్తున్నారు.
అటు నిజామాబాద్ అర్బన్‌లో అతి తక్కువ ఓట్లు పోలవ్వడంతో ఇక్కడ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ రూరల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి డా.భూపతిరెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురైందని చెప్పాలి. అక్కడ బీజేపీ ఉన్నప్పటికీ బాజిరెడ్డి, భూపతిరెడ్డి మధ్యనే పోటీ అని ప్రచారం జరుగుతుంది. అదే విధంగా కొన్ని మండలాలు, గ్రామాల్లో భూపతిరెడ్డికి సానుభూతితో పాటు బాజిరెడ్డికి వ్యతిరేక ఓట్లు అంతా ఆయనకే పడ్డాయని చర్చ జరుగుతుంది. బోధన్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్ కు కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన సుదర్శన్ రెడ్డికి మధ్యనే పోటీ అని స్థానికంగా చెబుతున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి బరిలో ఉన్న మూడవ స్థానమే అని చర్చ జరుగుతోంది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు షకీల్ వ్యక్తిగత శైలి వ్యవహరంపై ఓట్ల ప్రభావం పడితే మాత్రం ఫలితాలు తారుమారయ్యే అవకాశాలున్నాయి.
ఇక ఆర్మూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి బీజేపీ తరపున పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ తరపున వినయ్ రెడ్డి బరిలో ఉండి ముక్కోణపు పోటీ నెలకొంది. అక్కడ వినయ్ రెడ్డి సానుభూతితో పాటు కాంగ్రెస్ గాలిని నమ్ముకున్నారు. బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ప్రస్తుతానికి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఊహించని ఫలితాలు వస్తాయని చర్చ ఉంది. బాల్కొండ నియోజకవర్గం నుంచి మూడవసారి బరిలో నిలిచిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి ముక్కోణపు పోటీ నెలకొంది. అక్కడ బీజేపీ తరపున మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ బరిలో ఉండడంతో ప్రశాంత్ రెడ్డికి పెద్ద దెబ్బగా చెబుతున్నారు. ప్రశాంత్ రెడ్డి మేనత్త అయిన అన్నపూర్ణమ్మ చీల్చే ఓటు బీఆర్ఎస్ దేననే ప్రచారం జోరుగా ఉంది. అంతేగాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు కాంగ్రెస్ అనుకూల పవనాలపై కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ వచ్చే ఫలితాలు కొత్త ట్రెండ్ అన్న చర్చ జరుగుతుంది.
మరోవైపు బాన్సువాడ నియోజకవర్గం నుంచి అప్రహతితంగా ఏడుసార్లు గెలిచిన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎన్నికల నోటిఫికేషన్ వరకు పోటీ అనేది లేకుండా ఉండేది. బాన్సువాడ నియోజకవర్గంకు సంబంధించిన వారు బరిలో ఉంటారని తన గెలుపు ఖాయమని ఆయనలోనూ ధీమా ఉండేది. కానీ అక్కడ నాలుగుసార్లు గెలిచిన ఏనుగు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ బరిలో దింపడం ఊహించని షాక్ అని చెప్పాలి. అదే మాదిరిగా బీజేపీ తరపున బీజేపీ సీనియర్ నాయకుడు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ బరిలో ఉండడంతో అక్కడ కూడా ముక్కోణపు పోటీ నెలకొంది. బాన్సువాడలో ఈ సారి తీర్పు అందరూ ఊహించనది అనే చర్చ జరుగుతుంది.
కామారెడ్డి జిల్లాలో ముక్కోణపు పోటీ
కామారెడ్డి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. అక్కడ ఇద్దరు సిట్టింగ్‌లకు కేసీఆర్ కొనసాగింపు చేస్తునే తాను కూడా కామారెడ్డిలో బరిలో నిల్చున్నారు. కామారెడ్డిలో ఈసారి ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే గత నాలుగున్నర సంవత్సరాలుగా అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తున్న బీజేపీ నేత వెంకటరమణారెడ్డి బరిలో నిలిచి అందరికీ ఎన్నికల్లో చుక్కలు చూపుతున్నారు. సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ అక్కడ కేసీఆర్ గానీ, రేవంత్ రెడ్డితో గానీ పోటీ పడేది వెంకటరమణారెడ్డి అని ప్రచారంలో ఉంది. స్థానికుడు కావడం, నియోజకవర్గంలో సొంతంగా రూ.150 కోట్లతో డెవలప్ మెంట్ మేనిఫెస్టో ప్రకటించడంతో అక్కడ వెంకటరమణారెడ్డి ఎవరికి షాక్ ఇస్తారని అంతు చిక్కడం లేదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి జాజాల సురేందర్‌కు కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థి మదన్ మోహన్ గట్టి పోటీనిస్తున్నారు. అక్కడ బీజేపీ తరపున బరిలో నిలిచిన సుభాష్ రెడ్డి మూడవ స్థానానికి పరిమితం అని ప్రచారం జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉండగా గెలుపు అనేది లాంచనమే అని చెబుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో తొలిసారి ముక్కోణపు పోటీ నెలకొంది. అక్కడ నాల్గవసారి బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండేకు కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంత్ రావు, బీజేపీ అభ్యర్థి అరుణాతార గట్టి పోటీనిచ్చారు. అక్కడ ఈసారి కొత్త వారే గెలుస్తారని ప్రచారం జరుగుతుంది.