Chhattisgarh: ‘ఆపరేషన్ కర్రిగుట్ట’ ముగిసినట్లేనా!? ఆ కీలక అగ్రనేత సహా మావోయిస్టుల దళాలు ఎస్కేప్!

ఆపరేషన్‌ కగార్‌‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2025-04-27 05:51 GMT
Chhattisgarh: ‘ఆపరేషన్ కర్రిగుట్ట’ ముగిసినట్లేనా!? ఆ కీలక అగ్రనేత సహా మావోయిస్టుల దళాలు ఎస్కేప్!
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : ఆపరేషన్‌ కగార్‌‌లో భాగంగా ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో భద్రతా బలగాలు చేపట్టిన (Operation Karrigutta) కూంబింగ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా భారీ సంఖ్యలో (Maoist) మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో గత వారంరోజులుగా గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పోలీసు వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కర్రిగుట్టల అడవుల నుంచి మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా సహా మావోయిస్టు దళాలు క్షేమంగా తప్పుకున్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టి మాకాం మార్చినట్లు సమాచారం. ఆపరేషన్‌లో భాగంగా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మహిళా మావోయిస్టులు తప్ప మరెవరూ చనిపోలేదని పోలీసు వర్గాల సమాచారం. భద్రతా బలగాలు జరిపిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టుల 38 మంది చనిపోయారని ప్రచారం జరిగినప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

భారీ బంకర్ గుర్తింపు..

కాగా కర్రిగుట్టల్లో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో మావోయిస్టుల భారీ (Huge bunker) బంకర్‌‌ను గుర్తించిన విషయం తెలిసిందే. వెయ్యి మంది ఉండేలా భారీ గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది. మరోవైపు ఎండలు మండుతున్న వేళ.. ఆపరేషన్‌ చేపట్టిన బలగాలు నీరసించిపోతున్నాయి. రోజుల తరబడి నడక ఒకవైపు.. చెమటలు, ఉక్కబోతతో 100మందికి పైగా జవాన్లు వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు గురయ్యారు. మరోవైపు మావోయిస్టుల జాడ తెలియకపోవడంతో ఆపరేషన్ కర్రిగుట్ట దాదాపు ముగిసిపోయినట్లేనని తెలుస్తోంది.

శాంతి చర్చలపై పౌర హక్కుల సంఘాల డిమాండ్..

మరోవైపు కర్రిగుట్టల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ కగార్‌పై రాష్ట్రంలోని కమ్యూనిస్టులు, పౌరహక్కుల నేతలు, మేధావుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాల్పులను వెంటనే నిలిపివేయాలని, ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. శాంతిచర్చలకు తాము సిద్ధమంటూ ఇటీవల మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించాలని పౌర హక్కుల సంఘం నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News