ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వాదనలు.. తుది తీర్పు రిజర్వ్

ఖమ్మం లక్కారం లేక్ మధ్యలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై విధించిన స్టేను ఎత్తివేయాలంటూ నిర్వాహకులు వేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. శ్రీ కృష్ణుని రూపంలో విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకత రావటంతో మార్పులు

Update: 2023-05-25 12:43 GMT
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వాదనలు.. తుది తీర్పు రిజర్వ్
  • whatsapp icon

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : ఖమ్మం లక్కారం లేక్ మధ్యలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై విధించిన స్టేను ఎత్తివేయాలంటూ నిర్వాహకులు వేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. శ్రీ కృష్ణుని రూపంలో విగ్రహ ఏర్పాటుపై వ్యతిరేకత రావటంతో మార్పులు చేసినట్టు నిర్వాహకుల తరపున వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు చెప్పారు. విగ్రహం నుంచి నెమలి ఫించం, పిల్లన గ్రోవిని తొలగించినట్టు వివరించారు.

`తానా´ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని పెడుతున్నట్టు చెప్పారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న కోర్టు ఇప్పుడు ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఫోటోలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. ఉన్నాయని చెప్పిన అదనపు అడ్వకేట్ జనరల్ ఫోటోలను కోర్టుకు సమర్పించారు. కాగా, విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న వారి తరపు వాదనలు వినిపించిన న్యాయవాది సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పబ్లిక్ ప్లేసులో విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదన్నారు. లేక్ వద్ద అనుమతి ఇస్తే చెరువు మధ్యలో దానిని పెడుతున్నారని చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలనుకుంటే ఆయన ధరించిన వేరే పాత్రల రూపంలో పెట్టుకోవచ్చన్నారు. అలా కాకుండా దేవుని రూపంలో విగ్రహం పెట్టటం ఏంటని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుపై స్టేని పొడిగించాలని కోరారు. ఆ సమయంలో జోక్యం చేసుకున్న రాంచందర్ రావు శ్రీ కృష్ణుని రూపంలో సినిమాల్లో నటించినపుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు? అని అన్నారు. శ్రీ కృష్ణుడు ఒక కులానికి దేవుడు కాదని, ప్రపంచం మొత్తానికి ఆరాధ్య దైవమన్నారు. దేవునికి కులాన్ని ఆపాదించటం సమంజసం కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న జడ్జి తుది తీర్పును రిజర్వ్ చేసారు.

Tags:    

Similar News