AP TDP: తెలంగాణలో ఏపీ మంత్రులు.. ప్రాజెక్టు గండికి కారణం జగనే!

ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రాంతాల పర్యటనకు వెళుతున్న మంత్రులు తెలంగాణలో ఆగారు.

Update: 2024-07-27 09:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని వరద ప్రాంతాల పర్యటనకు వెళుతున్న మంత్రులు తెలంగాణలో ఆగారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడిన విషయం తెలిసిందే. దీని కారణంగా ఏపీలోని వేలేరు పాడు, కుక్కునూరు మండలాలు ముంపుకు గురై తీవ్రంగా నష్టపోయాయి. దీంతో వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పార్థసారథి తదితరులు వెళ్లారు. మార్గమధ్యంలో అశ్వారావు పేటలో ఆగి వరద ప్రాంతాల పరిస్థితుల పరిశీలించారు. పెద్దవాగు ప్రాజెక్టుపై ఐదేళ్ల పాటు జగన్ సర్కార్ చూపిన నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టుకు గండి పడిందని మంత్రులు అన్నారు. 2022లోనే రెండు రాష్ట్రాల నీటిపారుదల అధికారులు నిధుల కోసం చేసిన విజ్ఞప్తి పట్టించుకోకపోవడమే నేడు రైతుల ఇబ్బందికి కారణమని ఆరోపించారు. ఇక ఈ ఏడాది నుంచే రైతులకు తెలంగాణ ప్రభుత్వం నీరందించే ఏర్పాట్లకు రూ. 3.5 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

అనంతరం పోలవరం విలీన మండలాల్లోని వరద ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కాలనీకి వెళ్లిన మంత్రులు.. నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి నిర్వాసితులను అడిగారు. దానికి వారు ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు జమ కాలేదని, రోడ్లు, మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయని వివరించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. నిర్వాసితులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, పునరావాస కాలనీల్లో ఉన్నవారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వరద ప్రాంతాల్లో త్వరగా బయో టాయిలెట్లు ఏర్పాట్లు చేయాలని అచ్చెన్న ఆదేశించారు. గతంలో వరదలు వస్తే వైకాపా నేతలు పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతి కుటుంబానికి రూ.3 వేలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రానికి జగన్‌ చేసినంత నష్టం ఎవరూ చేయలేదని, వాస్తవాలు ప్రజలకు తెలిపేందుకు సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Tags:    

Similar News