విశాఖలో త్వరలోనే బీఆర్ఎస్ బహిరంగ సభ.. ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

విశాఖపట్నంలో త్వరలోనే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Update: 2023-04-13 16:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : విశాఖపట్నంలో త్వరలోనే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఏపీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ విజన్ కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముగ్ధులవుతున్నారని, ఆంధ్రకు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. తెలంగాణ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ దెబ్బకే 'వైజాగ్ స్టీల్ ప్లాంట్' విషయం లో కేంద్రం దిగివచ్చిందని, ఇది ఏపీలో తొలివిజయం అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడినందుకు, ఉద్యోగులు, కార్మిక సంఘాలు అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాలని అడుగుతున్నారన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ చేతులు ఎత్తేశాయని, ప్రజలకు అండగా నిలబడ్డది బీఆర్ఎస్ పార్టీ యే అన్నారు. 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అన్న నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంటును సాధించుకుందాం అని చేపట్టిన ఉద్యమంలో 32 మంది అసువులు బాసారన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసీఆర్ ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారన్నారు.

బైలడిల్లా గనులను అదానికి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి విశాఖ స్టీల్ ప్లాంటుకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్ఐఎన్ఎల్ కు సొంత గనులు కేటాయించాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంబంధించిన 20 వేల ఎకరాల భూములను రాష్ట్రపతి పేరు మీద పెట్టారని, దాన్ని వెంటనే ఆర్ఐఎన్ఎల్ మీద ట్రాన్స్ఫర్ చేయాలన్నారు. ఆర్ఐఎన్ఎల్ కు రూ.5 వేల కోట్లు తక్షణ సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్ కు ఆర్థికసాయం, వైజాగ్ రైల్వే జోన్, వైజాగ్ మెట్రో, దుగరాజపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ సహా విభన హామీలను నేటికీ కేంద్రం నెరవేర్చలేదని మండిపడ్డారు. ఏపీ విషయంలో మంత్రి హరీష్ రావు అన్నీ నిజాలే మాట్లాడారని, ఏపీ మంత్రుల దగ్గర సబ్జెక్ట్, సరుకు లేకనే ... హరీష్ రావు పై అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రజలు తమ సమస్యలను తీర్చగలగే నాయకుడి కోసం ఎదురుచూస్తున్నారని ఆ నాయకుడే కేసీఆర్ అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News