కాంగ్రెస్ ఖాతాలో మరో ఎమ్మెల్సీ సీటు పక్కా: మహేష్ కుమార్ గౌడ్
అభ్యర్ధికి సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు మద్ధతు తెలిపినట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధికి సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు మద్ధతు తెలిపినట్లు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శనివారం సీఎం సమక్షంలో మూడు పార్టీల కీలక నాయకులతో భేటీ జరిగింది. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని పార్టీలు మల్లన్నను గెలిపించాలని తీర్మానించాయన్నారు. సీపీఐ, సీపీఎం, జనసమితి పార్టీలు పూర్తిగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.
సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్యం బ్రతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలన్నారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. పొత్తులో భాగంగా సీపీఐగా కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు.
టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు సూచించారు. సీపీఎం నాయకులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ..ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం కూడా కాంగ్రెస్ కు మద్దతు పలుకుతోందన్నారు. విద్యాధికులు లోతుగా ఆలోచించాలన్నారు. ప్రస్తుత సామాజిక,రాజకీయ పరిస్థితులను అర్ధం చేసుకుని ఓటు వేయాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ను గెలిపించాలని కోరారు.