BRSకు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌తో టచ్‌లోకి డజన్ మంది ఎమ్మెల్సీలు

పెద్దల సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Update: 2023-12-06 04:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దల సభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకారం అందించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ సభ్యులు కాంగ్రెస్ హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ లిస్టులో గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న ఎమ్మెల్సీలు, అలాగే కేసీఆర్‌తో విసిగిపోయిన వారు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. సంఖ్యాబలం రాగానే పార్టీ మారేందుకు కూడా కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు

రేవంత్ రెడ్డి సర్కారుకు అసెంబ్లీలో కావాల్సిన మెజారిటీ ఉంది. కానీ, కౌన్సిల్‌లో కేవలం ఒకే ఒక్క సభ్యుడు జీవన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. ఎన్నికల ముందు కొడుకు టికెట్ కోసం కాంగ్రెస్‌లోకి వచ్చిన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ ఇద్దరితో మండలిలో బిల్లుల ఆమోదం కష్టంగా ఉంటుంది. అందుకని పెద్దల సభలో మెజారిటీ సభ్యుల మద్దతు కోసం కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది.

ఈ పక్రియలో కొందరు ఎమ్మెల్సీలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతామనే సంకేతాలను పంపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్నవారే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ముందుగా పెద్దల సభలో చర్చకు వచ్చే బిల్లుల అమోదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటంపైనే కాంగ్రెస్ దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. అందుకు కావాల్సిన సభ్యుల సంఖ్యపైనే ఆరా తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మండలిలో బీఆర్ఎస్ చీలిక?

ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యాబలం 35 ఉంది. అయితే అన్హరత వేటు పడకుండా కాంగ్రెస్‌లోకి వెళ్లాలంటే ఉన్న సభ్యుల్లో 2/3 వంతు మంది సభ్యులు అంటే 23 మంది పార్టీ మారితే చాలు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోకి వెళ్లే ఎమ్మెల్సీల సంఖ్య డజను దాటిందనే ప్రచారం జరుగుతున్నది. మిగతా సభ్యుల మద్దతు కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు వేగవంతం చేసిందనే టాక్ ఉంది. ఇదే జరిగితే మండలి సభలో బీఆర్ఎస్‌లో చీలిక తప్పదనే చర్చ జరుగుతున్నది. 2014లో కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తరువాత ముందుగా మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీల మద్దతు కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. దీంతో ఆ సభలో కాంగ్రెస్ పూర్తిగా కనమరుగైంది. ఆ తరువాత జరిగిన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీ చేసి పెద్దల సభకు వెళ్లారు.

బాధిత ఎమ్మెల్సీలు క్యూ..

కేసీఆర్ సర్కారులో తమకు సముచిత స్థానం దక్కని ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తున్నది. మంత్రి పదవి ఇవ్వలేదని కొందరు, తమను ఉపయోగించుకుని వదిలేశారని మరికొందరు ఎమ్మెల్సీలు పార్టీని దిక్కరించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ కొందరి ఎమ్మెల్సీలతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. అయితే పార్టీ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు కొందరు రెస్పాండ్ కావట్లేదని టాక్ కూడా ఉంది.


Similar News