Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో అరెస్ట్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ దూకుడు పెంచాయి. ఈ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యారు. వరుసగా రెండు రోజుల్లో దర్యాప్తు సంస్థలు ముగ్గురిని అరెస్ట్ చేశాయి. చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషిని గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన రాజేష్ జోషి నగదు బదిలీ చేయడంలో కీలకపాత్ర పోషించారని ఈడీ గుర్తించింది. సౌత్ గ్రూపు తరపున రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేష్ జోషి కీలకంగా వ్యవహరించాడని ఆరోపణలు ఉన్నాయి.
లిక్కర్ స్కాంలో ముడుపులుగా అందిన డబ్బులని గోవా ఎన్నికలకు ఆప్ ఉపయోగించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. చారియట్ మీడియా సంస్థ ద్వారా పెద్ద ఎత్తున డబ్బును గోవా ఎన్నికలలో ఆప్ తరపున రాజేష్ జోషి ఖర్చు పెట్టారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జోషిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు..జోషిని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్(సీఏ) గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని..హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
బుచ్చిబాబు అరెస్టు అనంతరం మద్యం పాలసీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన గౌతమ్ మల్హోత్రాను కూడా ఈడీ అధికారులు బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గౌతమ్ మల్హోత్రాను కస్టడీలోకి తీసుకున్నారు. మద్యం వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అతన్ని ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు సీబీఐ, ఈడీ అధికారులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అరెస్ట్ అయ్యారు. వారిలో శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఉన్నారు. తాజా అరెస్టులతో దేశరాజకీయాల్లో మరోసారి లిక్కర్ స్కాం సంచలనంగా మారింది.