పౌల్ట్రీ ఫారాల ముసుగులో ‘అల్ఫ్రాజోలం’
ఇటీవల కాలంలో మత్తు పదార్థాల్లో అధికంగా వినిపిస్తున్న పేరు అల్ఫ్రాజోలం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కాలంలో మత్తు పదార్థాల్లో అధికంగా వినిపిస్తున్న పేరు అల్ఫ్రాజోలం. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సయిజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అల్ఫ్రాజోలం డ్రగ్స్ దందాలో హైలి క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ యువకులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారు, కెమిస్ట్రీలో పీహెచ్ డీ చేసిన వారు ఈ దందాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు కేసుల దర్యాప్తులో వెల్లడవుతోంది. అల్ప్రాజోలంను కల్తీ కల్లు తయారీకి వినియోగిస్తున్నారని, ఇది కోకైన్ కంటే ప్రమాదకరమైన మత్తు పదార్థంగా నార్కొటిక్స్ అధికారులు గుర్తించారు.
ఎడ్యుకేటెడ్ కేటుగాళ్లు
ఎక్సైజ్ డిపార్ట్మెంట్, టీజీనాబ్ నిర్వహించిన దాడుల్లో కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్స్ ఈ దందాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా వారు ఈ దందాకు తెరలేపుతున్నారని తెలిసింది. ఈ ముఠాలకు చెందిన తయారీదారు నుంచి కేజీ రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల కొనుగోలు చేసి కల్లు దుకాణాలకు కేజీ రూ.10 లక్షలకు విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలో మిర్యాలగూడ ప్రాంతంలోని ఫౌల్ట్రీ ఫారంలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న ముఠాను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తి కెమిస్ట్రీలో పీహెచ్ డీ చేసి అల్ర్పాజోలం తయారీలో ఆరితేరాడు. మూతపడ్డ ఫార్మా కంపెనీల్లో అల్ఫ్రాజోలం తయారు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ముఠాకు చెందిన వారి నుంచి సుమారు రూ.63 కోట్ల విలువైన ఆస్తులను టీజీనాబ్ అధికారులు సీజ్ చేశారు.
తెలంగాణలో దాడుల వివరాలు..
* జనవరి 18న సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలం కొత్తపల్లి శివారులో కోళ్ల ఫారం లో 2.6 కేజీల నిషేధిత అల్ఫాజోలం గుర్తించారు. విలువ రూ.కోటి
* జనవరి 10న మిర్యాలగూడ చౌరస్తాలో రూ.55 లక్షల విలువ చేసే 5.35 కేజీల ఆల్ప్రాజోలంను పట్టుకున్నారు.
* జనవరి 1న రూ.15 లక్షల విలువైన అల్ఫ్రాజోలం టాబ్లెట్స్ పట్టుకున్నారు. కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో జహీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు.
* డిసెంబర్ లో సిద్ధిపేటలో రూ.15 లక్షల విలువైన కిలోన్నర అల్ఫ్రాజోలం పట్టుకున్నారు
* అక్టోబర్ లో రూ.43 లక్షల విలువైన అల్ఫ్రాజోలం పట్టుకున్నారు
నాలుగు జిల్లాల్లో విక్రయాలు
అల్ఫ్రాజోలం విక్రయాలు అధికంగా నాలుగు జిల్లాల పరిధిలో సాగుతున్నట్లు ఎక్సైజ్ అధికారుల దాడుల్లో వెల్లడవుతోంది. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయి. కోళ్ల ఫారాల ముసుగులో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్నారు. ఢిల్లీ,
కర్ణాటక, ఒడిశా, ఏపీ రాష్ట్రాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకుని అల్ప్రాజోలం తయారు చేస్తున్నారు.