MP కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భారీ షాకిచ్చిన హైకమాండ్

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పార్టీ అధిష్టానం భారీ షాకిచ్చింది. మునుగోడులో కాంగ్రెస్ గెలవదు అని వ్యాఖ్యానించడమే కాకుండా తన సోదరుడు

Update: 2022-10-23 08:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిచినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్ ఫిర్యాదు మేరకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ మెంబర్ సెక్రటరీ తారిఖ్ అన్వర్ శనివారం రాత్రి ఈ షోకాజ్ నోటీసును ఎంపీ వెంకటరెడ్డికి పంపించారు. కాంగ్రెస్ తరపున మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న అభ్యర్థి పాల్వాయి స్రవంతికి బదులుగా బీజేపీ తరపున పోటీ చేస్తున్న సోదరుడికి ఓటు వేయాలంటూ ఒక కార్యకర్త (కాంగ్రెస్)తో ఫోన్‌లో మాట్లాడడాన్ని మాణిక్కం ఠాగూర్ ప్రస్తావించారని తారిఖ్ అన్వర్ ఆ నోటీసులో ప్రస్తావించారు.

ఈ ఆడియో క్లిప్ అటు సోషల్ మీడియాతో పాటు ఇటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వైరల్ అయిందని, స్వంత పార్టీ అభ్యర్థికి బదులుగా ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేస్తున్న రక్త సంబంధం కలిగిన అభ్యర్థికి మద్దతు పలకడం పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన జబ్బార్ అనే కార్యకర్తతో ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ ఆధారంగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగానే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని స్పష్టం చేశారు. పది రోజుల్లోగా జవాబు ఇవ్వాలని గడువును నిర్దేశించిన తారిఖ్ అన్వర్ క్రమశిక్షణ తప్పినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే నెల మొదటి వారంలో తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ విధించిన గడువు వచ్చే నెల 2వ తేదీతో ముగియనున్నది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ వచ్చే నెల 3న జరగనున్నది. పోలింగ్‌ జరగడానికి ముందే ఎంపీ కోమటిరెడ్డి తన సంజాయిషీని పార్టీకి లిఖితపూర్వకంగా పంపాల్సి ఉంటుంది.



 


Tags:    

Similar News