ఆసరా కన్నా అధ్వానంగా..! సింగ‌రేణి కార్మికుల‌కు పెర‌గ‌ని పింఛన్

త‌మ ర‌క్తాన్ని చెమ‌ట‌గా మార్చి సింగ‌రేణి భూగ‌ర్భంలోకి దిగి ప‌నిచేసి రిటైర్డ్ అయిన కార్మికులు వారు.

Update: 2024-05-26 05:17 GMT

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: త‌మ ర‌క్తాన్ని చెమ‌ట‌గా మార్చి సింగ‌రేణి భూగ‌ర్భంలోకి దిగి ప‌నిచేసి రిటైర్డ్ అయిన కార్మికులు వారు. పదవి విమరణ తరువాత సుఖంగా విశ్రాంత జీవితం గడుపుతామని కలలు కన్న బొగ్గు గని కార్మికుల జీవితాలు తలకిందులు అవుతున్నాయి. వారు నామమాత్రపు పింఛన్‌తో బతుకీడుస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి కోసం కష్టపడిన కార్మికులు వయసు మీద పడ్డాక కీళ్ల అరుగుదల, శ్వాసకోస సంబంధ వ్యాధులతో సతమతమవుతున్నారు. పింఛన్ సొమ్ము ఎటూ సరిపోక అప్పులపాలు అవుతున్నారు. చాలా మంది రిటైర్డ్ కార్మికులు ఇప్పటి వ‌ర‌కు రూ.200 నుంచి రూ. 500 వ‌ర‌కే పింఛన్ పొందుతున్నారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. కోలిండియా వ్యాప్తంగా ప్రస్తుతం 5 లక్షల మంది బొగ్గు గని కార్మికులు పెన్షన్ పొందుతున్నారు. అందులో 1.20 లక్షల మంది రూ. వెయ్యి కన్నా తక్కువ పెన్షన్ పొందుతున్నారు. సింగరేణిలో 40 వేల మందికి పైగా రూ.వెయ్యి కన్నా తక్కువ పెన్షన్ పొదుతున్న వారు ఉన్నారు.

ఏళ్లుగా పోరాటం..

పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోలిండియా వ్యాప్తంగా 2011లో పెన్షనర్ల అసోసియేషన్ ఏర్పడింది. నాలుగేళ్ల పాటు పోరాడిన అసోసియేషన్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి గోడు వినిపించుకున్నా స్పందన రాలేదు. దీనితో తమకు న్యాయం చేయాలంటూ.. 2015 జనవరిలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశాన్ని కింది కోర్టులో తేల్చుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆ పిటిషన్లను ఢిల్లీ కోర్టుకు బ‌దిలీ చేసింది. ఏళ్లు గడుసున్నా.. పింఛన్ పెంపుపై నిర్ణయం వెలువడ లేదు. 26 ఏళ్లుగా రూ.వెయ్యి లోపు పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ కార్మి‌కుల కనీస పెన్షన్ ఎట్టకేలకు రూ.వెయ్యికి పెంచింది కేంద్రం. అయితే, గ‌త నెల 8న విడుదల చేసిన గెజిట్‌పై పింఛన్‌దారులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

ఆసరా కన్నా.. అధ్వానంగా..

బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ ప్రస్తుతం రూ.350గా ఉంది. 23 ఏళ్ల పోరాటం తర్వాత కేంద్రం దానిని తాజాగా రూ.వెయ్యికి పెంచింది. ఆ పెంపు రూ.వెయ్యి లోపు పెన్షన్ ఉన్న బొగ్గు గని కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. రూ.1001 మించిన బొగ్గు గని కార్మికులకు తాజా పెంపుతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.2,016 పింఛన్ ఇస్తోంది. కానీ, రిటైర్డ్ కార్మికులు సీఎంపీఎఫ్ పింఛన్ అందుకుంటుండటంతో వారికి ఆసరా పథకానికి అర్హత లేకుండా పోయింది. కానీ, ఆసరా కన్నా చాలా తక్కువగా కేవలం రూ.500, వెయ్యి లోపే సీఎంపీఎఫ్ పింఛన్ వస్తుండటం గమనార్హం.

పింఛన్‌తో బ‌తికేది ఎలా..?

నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో కేవలం రూ.వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్డ్ కార్మికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ చేసిన బొగ్గు ఉద్యోగుల కుటుంబాలు రూ.వెయ్యి పింఛన్‌తో ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ల సవరణ కమిటీ కేవలం రూ.వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగులు అందిస్తున్న బొగ్గు గని కార్మికులు రిటైర్మెంట్ తర్వాత తమ జీవితపు చరమాంకంలో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా పెంచాలని, కరువు భత్యం సైతం చెల్లించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


Similar News