ఫంక్షన్ హాల్‌గా మారిన ప్రభుత్వ ఆసుపత్రి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి శుక్రవారం రాత్రి మినీ ఫంక్షన్ హాల్‌గా మారింది.
దిశ, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి శుక్రవారం రాత్రి మినీ ఫంక్షన్ హాల్‌గా మారింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఉత్తమ ఉద్యోగులుగా పురస్కారం అందుకున్నారు. ఈ ఆనందంలో వారు శుక్రవారం రాత్రి 10గంటల తర్వాత ఆసుపత్రిలోనే పార్టీ చేసుకున్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల పర్యవేక్షకుడు, వైద్య సిబ్బంది సహా పలువురు ఈ దావత్‌లో పాల్గొన్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది దావత్‌లు చేసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.