నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

అజాగ్రత్తతోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Update: 2024-11-29 11:05 GMT

దిశ, వాంకిడి : అజాగ్రత్తతోనే ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రైబల్ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలను ఆయన డీటీడీఓ రమాదేవితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వంటగది, పరిసరాలతో పాటు బియ్యం, నూనె, పప్పు, కూరగాయలు తదితర వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. నాణ్యత లోపించిన కోడిగుడ్లు, సామాగ్రి వస్తాయని పరిశీలించి వాటిని రిటర్న్ పంపాలని సూచించారు.

     వంటలు చేసే సమయంలో చీడ పురుగులు పడే అవకాశం ఉంటుందని, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ వాటిని నియంత్రించాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పలువురు విద్యార్థినులతో మాట్లాడారు. మృతి చెందిన శైలజ గతంలో ఎలా ఉండేదని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే కోణంలో ఆరా తీశారు. ఆశ్రమంలో అందిస్తున్న భోజన మెనూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా తెలపాలన్నారు. ఇక్కడ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల పట్ల సిబ్బంది అప్రమత్తతో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. 


Similar News