గుట్టుగా బియ్యం రీసైక్లింగ్ దందా..? మిల్లర్ల జేబులు నింపుతున్న వైనం..!
ఖరీఫ్,రబీ సీజన్ కి సంబంధించి మిల్లర్లకు కేటాయించిన సీ.ఎం.ఆర్ ధాన్యం సకాలంలో పూర్తి అయి ఎఫ్.సి.ఐ కి చేరడం లేదని, మిల్లర్లకు కేటాయించిన
దిశ, బైంసా: ఖరీఫ్,రబీ సీజన్ కి సంబంధించి మిల్లర్లకు కేటాయించిన సీ.ఎం.ఆర్ ధాన్యం సకాలంలో పూర్తి అయి ఎఫ్.సి.ఐ కి చేరడం లేదని, మిల్లర్లకు కేటాయించిన సి.ఎం.ఆర్ బియ్యం ఆరు నెలల్లో ఎఫ్.సి.ఐకి అందించాల్సి ఉండగా ఈ తంతు జరగకుండా కాలయాపన జరిగి, ధాన్యం పక్కదారి పడుతుందని.. పక్కదారి పట్టిన ధాన్యంతో మిల్లర్లు జేబులు నింపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
రేషన్ బియ్యం మళ్ళీ ఎఫ్.సి.ఐ కె వయా.. దళారులు, మిల్లర్లు
రేషన్ షాపులలో అందించే బియ్యం మళ్లీ తిరిగి తిరిగి ఎఫ్.సి.ఐ కే చేరుతుంది. రేషన్ షాపులలో అందించే బియ్యాన్ని ప్రజలు తీసుకెళ్లగా మళ్లీ వయా... దళారులు, మిల్లర్ల చేతుల మీదుగా ఎఫ్.సి.ఐకే చేరుతుంది. నెల నెల రేషన్ షాపులలో అందించే బియ్యాన్ని ప్రజల వద్ద నుంచి దళారులు కొనగా, తిరిగి ఆ బియ్యం రైస్ మిల్లర్ల వద్దకు చేరుతుంది.రైస్ మిల్లర్ వద్దకు చేరిన బియ్యం సి.ఎం.ఆర్ ధాన్యానికి లెక్క చెప్పే విధంగా పాలిష్ చేసి తిరిగి ఎఫ్.సి.ఐ కి పంపించడం జరుగుతుంది. బియ్యం దళారులతో మిల్లర్లు ఏకమై గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా జరుగుతుందని, సీ.ఎం.ఆర్ కై కేటాయించిన బియ్యం లారీలలో పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
ధాన్యం పక్కదారి మల్లింపు..
తాలూకా వ్యాప్తంగా కొందరు రైస్ మిల్లర్లు సి.ఎం.ఆర్( కస్టమ్ మిల్లింగ్ రైస్)కోసం కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.గత కొన్ని నెలల క్రితం బై0సా డివిజన్లోని ఓ రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా అక్రమంగా బియ్యం అన్లోడ్ చేసినట్లు గుర్తించి,కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే..! ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది రైస్ మిల్లర్లు గోదాముల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని లారీల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని ఎఫ్.సి.ఐ కి అప్పగించాల్సి ఉండగా చాలా చోట్ల ఇది జరగడం లేదు. దళారుల ద్వారా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తూ వాటిని పాలిష్ చేసి తిరిగి ఎఫ్.సి.ఐ కి అప్పగిస్తున్నారు.ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులకు తెలియదా..! అన్నది సందేహం గానే ఉంది. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు నిఘా ఉంచి చర్యలు చేపడితే ఇలాంటి తప్పులు జరగవు.