సింగరేణి లాభాలు రూ.3 వేల కోట్లు..? ఈ ఏడాది 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది.
దిశ, ఆదిలాబాద్ బ్యూరో: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. ఈ ఏడాది అనుకున్న విధంగా ఉత్పత్తి సాధించడంతో పాటు వ్యాపారం కూడా సాగడంతో లాభాలు భారీగానే వస్తాయని కార్మికులు భావిస్తున్నారు. రూ.3 వేల కోట్ల మేర లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది లాభాల్లో కార్మికులకు 32 శాతం ఇవ్వగా ఈ ఏడాది ఇంకా ఎక్కువ ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించుకున్న సింగరేణి 70.02 మిలియన్ టన్నుల వార్షిక లక్ష్యాన్ని సాధించింది.
అంతకు ముందు ఏడాది 67.13 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఆ ఏడాది రూ.2,222 కోట్ల లాభాలను ఆర్జించింది. 70.02 మిలియన్ టన్నుల లక్ష్యం సాధించిన సింగరేణి సంస్థ గడిచిన ఏడాది రూ.37 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు అంచనా వేస్తోంది. ఇటు బొగ్గు ఉత్పత్తి పెరగడంతో పాటు వ్యాపారం ఎక్కువగానే సాగడంతో లాభాలు ఎక్కువగా ఉంటాయని కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.3 వేల కోట్ల లాభాలు ఉంటాయని చెబుతుండగా, వాస్తవ లాభాలు ప్రకటిస్తే మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
గతేడాది 32 శాతం.. రూ.711.18 కోట్లు చెల్లింపు..
దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీలో లేని విధంగా సింగరేణి సంస్థ ప్రతి ఏడాది తనకు వచ్చిన నికర లాభాల్లో కొంత శాతం వాటాను లాభాల బోనస్‌గా కార్మికులకు పంచుతోంది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత గతంలో కన్నా ఎక్కువ శాతం లాభాల వాటా బోనస్‌ను ప్రకటిస్తూ వస్తున్నారు. తెలంగాణ రాక ముందు 2013-14లో ఇది 20 శాతం ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014-15లో 21 శాతం, 2015-16లో 23 శాతం (245.21 కోట్లు) 2016-17లో 25 శాతం (98.85 కోట్లు), 2017-18లో27 శాతం (327.44 కోట్లు), 2018-19లో 28 శాతం (493.82 కోట్లు), 2020-21లో 29 శాతం (79.07 కోట్లు), 2021-22లో 30 శాతం (368.11 కోట్లు) ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరం (2022-23) సింగరేణి సంస్థ సాధించిన నికర లాభాలు రూ.2,222 కోట్లలో 32 శాతం రూ.711.18 కోట్లను లాభాల బోనస్ గా కార్మికులకు చెల్లించారు.
ఎన్నికల కోడ్ ముగిశాక సీఎం కీలక ప్రకటన!
వాస్తవానికి లాభాల ప్రకటన ప్రతి ఏడాది ఆలస్యమే అవుతోంది. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. సంస్థ ఆడిటింగ్ ముగిసిన వెంటనే సంస్థ చేసిన వ్యాపారం, లాభాలు ప్రకటించాలి. కానీ, సంస్థ ఈ విషయంలో ప్రతి ఏడాది ఆలస్యం చేస్తోంది. దసరా సమయంలో కార్మికులకు ఈ లాభాలు చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ముందుగానే ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సింగరేణి లాభాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది అనుకున్న సమయానికి కంటే ముందే లాభాలు కార్మికులకు పంపిణీ చేయనున్నారు. అయితే, ప్రతి ఏడాది పెంపు లాగానే గత ఏడాది 32 శాతం కంటే పెంచాలని కార్మికులు కోరుతున్నారు. అదే జరిగితే దాదాపు రూ.900 కోట్ల మేర లాభాలు పంపిణీ జరగనుంది.