రాజీవ్ యువ వికాసం పథకంపై కొత్త అప్డేట్
రాజీవ్ యువ వికాసం పథకంపై కొత్త అప్డేట్ వచ్చింది.
దిశ, ఆదిలాబాద్ : రాజీవ్ యువ వికాసం పథకంపై కొత్త అప్డేట్ వచ్చింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా వెల్లడించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పథకంను నూతనంగా ప్రారంభించిందని, ఈ పథకం కింద అన్ని కార్పొరేషన్ లకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తో కలిసి రాజీవ్ యువ వికాసం పథకం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాజీవ్ యువవికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తు గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్టు వివరించారు. మున్సిపాలిటీ, ఎంపీడీఓ కార్యాలయంలో ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డీఆర్డీఓ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అధికారులు నోడల్ అధికారులుగా ఉన్నారని, బ్యాంక్ మేనేజర్లు ఈ కార్యక్రమంపై ఓరియంటేషన్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మనోహర్, సీఈఓ, డీపీఓ, బ్యాంక్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.