చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి..
ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ అన్నారు.
దిశ, మందమర్రి : ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భదావత్ సంతోష్ అన్నారు. బుధవారం పట్టణ ప్రభుత్వ ఆదర్శ మోడల్ పాఠశాలలో విద్యార్థుల డ్యూయల్ డెస్కులు ప్రారంభానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రారంభం నుండి ఉపాధ్యాయులు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను బోధిస్తున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని జాష్ణవికి 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించిందన్నారు.
రాష్ట్రంలో రెండవ స్థానం కైవసం చేసుకున్న జాష్ణవిని ఘనంగా సత్కరించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. అనంతరం జిల్లా విద్యాధికారి ఎస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు గత జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి 5 లక్షల రూపాయల విలువగల 80 డ్యూయల్ డెస్క్ లు, 70 ల్యాబలేటరీ స్టూల్స్, 3 నోటీస్ బోర్డులు మంజూరు చేశారని స్పష్టం చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మందమర్రి మోడల్ పాఠశాల ఉపాధ్యాయుల విద్యాబోధన ఉందని అన్నారు. అనంతరం విద్యార్థినీల వసతి గృహంలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు జయకృష్ణ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన మంజూరుకు హామీ ఇచ్చారు.
అనంతరం వసతి గృహాన్ని డీఏఓ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పోచయ్య, మున్సిపల్ కమిషనర్ జి.రాజు, ఎంపీడీవో పి.శశికళ, తాసిల్దార్ సంపత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు.