అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న కలపను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ముదావత్ నైలు తెలిపారు.
దిశ, గుడిహత్నూర్: అక్రమంగా తరలిస్తున్న కలపను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ముదావత్ నైలు తెలిపారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పక్క సమాచారంతో గుడిహత్నూర్ క్రాస్ రోడ్డు వద్ద ఇచ్చోడ సీఐ నైలు, గుడిహత్నూర్ ఎస్ఐ ప్రవీణ్ రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంలోని హిందుస్థాన్ దాబా సమీపంలో ఒక ఐచర్ అనుమానస్పదంగా కనిపించడంతో నిలిపి ఉన్న వ్యాన్ ను తనిఖీ చేస్తుండగా ఐచర్ వ్యాన్ డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని విడిచి పరారయ్యారు.
వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 48 టేకు దుంగలు ఉండడంతో వాహనాన్ని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేశారు. ఎఫ్ఆర్వో పాండురంగం, సెక్షన్ ఆఫీసర్ కృష్ణ నాయక్, ఎఫ్.బీ.వో నరసయ్య ఐచర్ వ్యాన్ స్వాధీనం చేసుకొని ఇచ్చోడ కలుప డిపోకు తరలించారు. కలప విలువ సుమారు రూ.5లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై బలిరాం, కానిస్టేబుల్ విట్టల్ భూమన్న సదాశివ్ పాల్గొన్నారు.