చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో గడ్డం వంశీ ?
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో ఎన్నో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తున్నాయి.
దిశ, చెన్నూర్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో ఎన్నో విచిత్ర పరిణామాలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తున్నాయి. చెన్నూర్ నియోజకవర్గం గత ఎన్నో సంవత్సరం నుండి ఎస్సీ మాల రిజర్వేషన్ కు కేటాయించడంతో ఎంతోమంది అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో పై కన్ను వేస్తున్నారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుండి దివంగత కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి కుమారుడు, మాజీ ఎంపీ ప్రస్తుత భాజపా కేంద్ర కమిటీ సభ్యులు వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఈ నియోజకవర్గంలో నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు గుసగుసలాడుతున్నారు. గతంలో వెంకటస్వామి పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిపదవి పొందారు. ఆ తర్వాత ఆయన కుమారుడు వివేక్ ఇదే నియోజకవర్గము నుండి ఎంపీగా విజయం సాధించారు.
ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వివేక్ సోదరుడు గడ్డంవినోద్ ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీఅభ్యర్థిగా పోటీచేసి అప్పటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జనార్దన్ పై అత్యంత మెజారిటీతో గెలుపొంది మంత్రిపదవి పొందారు. ప్రస్తుతం భాజాపాలో కొనసాగుతున్న గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఈ నియోజకవర్గంలో నుండి టికెట్ ఆశిస్తున్నట్లు గతంలో వీరికుటుంబ సభ్యులు మంత్రులుగా ఉన్న సందర్భంలో వీరి కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండి ప్రస్తుతం వివిధ పార్టీలలో పనిచేస్తున్న నాయకులతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీని నియమిస్తే గతంలో వీరితోపాటు కాంగ్రెస్లో పనిచేసి ప్రస్తుతం వివిధ పార్టీలలో పనిచేస్తున్న నాయకులను తనతో పాటుగా కాంగ్రెస్ పార్టీలోకి మారాలని వారిని రహస్యంగా ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భాజపాలో కొనసాగుతున్న గడ్డం వివేక్ తనతో పాటు బాజాపాలో చేరిన నాయకులతోపాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు సమాచారం.
సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సందర్భంలో గడ్డం వివేక్ ఎంపీగా ఉండడం ప్రత్యేక రాష్ట్ర సాధనలో అప్పటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒప్పించడంలో వివేక్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామంలో భాగంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటికీ సీట్లకేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించడం లేదని కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వివేక్ మనసు మార్చుకుని తనకు పెద్దపెల్లి నియోజకవర్గ ఎంపీ సీట్ తో పాటు తన కుమారునికి చెన్నురు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. ఏది ఏమైనాప్పటికీ రాబోయే ఎన్నికలు చెన్నూరు నియోజకవర్గంలో ఎంతో రసవత్తరంగా మారనున్నాయి.