గ్రీన్ ఫీల్డ్ హైవే వద్దంటూ రోడ్డెక్కిన రైతులు
ఫోర్ లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ భూములను లాక్కోవద్దని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని పలు గ్రామాల రైతులు రోడ్డెక్కారు.
దిశ, లక్షెట్టి పేట: ఫోర్ లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం తమ భూములను లాక్కోవద్దని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని పలు గ్రామాల రైతులు రోడ్డెక్కారు. ఆదివారం లక్ష్మీపూర్ గ్రామ 63వ నెంబర్ జాతీయ రహదారిపై సుమారు గంట సేపు రాస్తారోకో, ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ… గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తమ పంట భూములు కోల్పోయి నష్టపోయామన్నారు. 63 వ జాతీయ రహదారి విస్తరణలో గ్రీన్ ఫీల్డ్ హై కోసం గతంలో దండేపల్లి మండలం గూడెం నుంచి ఉత్కూర్ చౌరస్తా గంపల పెల్లి మీదుగా ఒకసారి సర్వే చేసి ఇదే జాతీయ రహదారిని మళ్ళీ ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంత భూముల నుంచి నిర్మించే యత్నాలు జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఏ విధంగా ఎక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్నామని చెప్పారో, ఆ పాత హైవే మీదుగా దాన్ని నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.
మా వ్యవసాయ పంట భూములు పోతే మాకు దిక్కు లేదని, మా భూములు ఇచ్చేది లేదన్నారు. సర్వేలను అడ్డుకుంటామని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతామన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్సై చంద్రకుమార్ వచ్చి కలెక్టర్‌తో మాట్లాడి రైతులకు న్యాయం చేయిస్తామని చెప్పగా ఆందోళనను విరమించారు. రైతులను సముదాయించారు. ఈ నిరసనలో లక్షేటిపేట, మోదెల, ఇటిక్యాల , పోతేపల్లి, సూరారం, గుల్లకోట,హాజీపూర్ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.